సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం, మంత్రుల దిగ్ర్భాంతి

సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం, మంత్రుల దిగ్ర్భాంతి

హైదరాబాద్, వెలుగు: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్​కు చెందిన 45 మంది యాత్రికులు మృతిచెందడంపై  సీఎం రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీని అదేశించారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడి.. తగిన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం ఆదేశాలతో అధికారులు సెక్రటేరియెట్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే, సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​, రాష్ట్ర మంత్రులు వివేక్​వెంకటస్వామి,  అజారుద్దీన్,  జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర్​రావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉమ్రా యాత్ర కోసం మక్కా, మదీనాకు వెళ్లిన వారు బస్సు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు.