వికారాబాద్, వెలుగు: చేయని నేరం ఒప్పకోవాలని ఓ యువకుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం మంబాపూర్గ్రామానికి చెందిన గౌస్ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుడి రిపోర్ట్స్ వచ్చాయంటూ సోమవారం పోలీసులు ఫోన్ చేసి అతడి అల్లుడు ఫిరోజ్‌కు స్టేషన్కు పిలిచారు. అతడు పీఎస్‌కు వచ్చిన వెంటనే లోపలికి తీసుకెళ్లి థర్డ్‌డిగ్రీ ఉపయోగించారు. చేయని నేరం ఒప్పుకోవాలని కాళ్లు, చేతులపై 40 నిమిషాలపాటు కొట్టి చిత్రహింసలు పెట్టారు. దెబ్బలకు ఫిరోజ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
