ధాన్యం ఆన్లైన్ ఎంట్రీ లేటెందుకు అవుతోంది : కలెక్టర్ ఆదర్శ్ సురభి

ధాన్యం ఆన్లైన్ ఎంట్రీ లేటెందుకు అవుతోంది : కలెక్టర్ ఆదర్శ్ సురభి
  • అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

వనపర్తి, వెలుగు: జిల్లాలో ఇప్పటి వరకు 13 వేల మెట్రిక్  టన్నుల వడ్లను కొనుగోలు చేశామని, అందులో 10,682 మెట్రిక్  టన్నులు మిల్లులకు తరలించినప్పటికీ, 6 వేల మెట్రిక్  టన్నులు మాత్రమే ఆన్​లైన్​లో ఎంట్రీ చేయడంపై కలెక్టర్​ ఆదర్శ్​ సురభి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లులను వెంటనే సీజ్  చేయాలని సివిల్  సప్లై ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్ లో వడ్ల కొనుగోళ్లపై జిల్లా అధికారులతో రివ్యూ చేశారు. ఇప్పటి వరకు 876 మెట్రిక్  టన్నుల వడ్లకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు తప్పనిసరిగా వాడాలని ఆదేశించారు. 

పానగల్  మండలంలో కోతలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని, ఐకేపీ, పీఏసీఎస్​ సంఘాల వారు సమన్వయం చేసుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి, ఆన్​లైన్  ఎంట్రీకి పొంతన లేదని, డేటా ఎంట్రీ ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. వడ్లు తరలించే అన్ని వాహనాలకు జియో ట్యాగింగ్  చేయాలని ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్​ ఖీమ్యా నాయక్, డీఎస్​వో కాశీ విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, డీఏవో ఆంజనేయులు, డీసీవో ఇందిర, డీటీవో మానస, మార్కెటింగ్  అధికారి స్వరణ్ సింగ్  పాల్గొన్నారు.