పెద్దపల్లి జిల్లాలో పాము కాట్ల టెన్షన్‌‌‌‌

పెద్దపల్లి జిల్లాలో  పాము కాట్ల టెన్షన్‌‌‌‌
  • జిల్లాలో రెండు నెలల్లో 127 కేసులు 
  • సమీప స్కూల్స్ , ఇండ్లల్లో పాముల ఆవాసాలు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో కొద్దిరోజులుగా పాము కాట్లు పెరిగిపోతున్నాయి. రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 127 కేసులు నమోదైనట్లు రికార్డులు చెప్తున్నాయి. పొలాల్లో ఫర్టిలైజర్స్ వినియోగం పెరిగాక.. వాటి వాసనకు కొన్ని పాములు చనిపోతుండగా.. మరికొన్ని జనావాసాల బాట పడుతున్నాయి. ఈక్రమంలో పాము కాట్లు పెరుగుతున్నాయి. కాగా పాము కరిచినప్పుడు సరైన టైంలో స్పందించకపోవడం, పాము కాట్లపై అవగాహన లేక కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. 

స్కూళ్లు, ఇండ్లే ఆవాసాలుగా.. 

 పొలాలు, చేన్ల గట్లు, పుట్టల్లో ఉండే పాములు వాటి ఆవాసాలను వీడి జనావాసాల వైపు వస్తున్నాయి. పొలాల్లో, చేన్లలో పురుగుల మందులు విస్తృతంగా వాడుతుండడం, అటవీ ప్రాంతాలు, చెట్ల పొదలు తగ్గిపోవడంతో పాములు వాటి ఆవాసాన్ని మార్చుకుంటున్నాయి. 

ఇంటి పరిసరాలు, సమీప స్కూళ్లలోకి, ఇతర జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఈక్రమంలో ప్రజలు, విద్యార్థులు పాము కాటుకు గురవుతున్నారు. ఇటీవల జిల్లాలోని ఓ స్కూల్​లో పాము కన్పించడంతో స్నేక్​ స్నాచర్‌‌‌‌‌‌‌‌తో పట్టించి దూరంగా విడిచిపెట్టారు. గత రెండు నెలల్లో దాదాపు 127 పాము కాటు కేసులు నమోదైనట్లు రికార్డులు చెప్తున్నాయి. కానీ గ్రామాల్లో పాము కాటు వేస్తే హాస్పిటల్‌‌‌‌కు రాని కేసులు కూడా ఉంటున్నాయి. 

పాము కాటేస్తే ఏం చేయాలి

పాముల్లో చాలా రకాలుంటాయి. అందులో కొన్ని మాత్రమే విషపూరితమైనవి కాగా.. విషం లేనివే ఎక్కువ. పాము కరిచిన వెంటనే గాయమైన ప్రాంతంలో పళ్ల గాట్లను బట్టి విషపూరితమా కాదా తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఒకటి లేదా రెండు పన్ను గాట్లు ఉంటే విషపూరితమైందని, వెంటనే చికిత్స తీసుకోవాలి. పాములు కరిచిన తొలి అరగంట కీలకం. 

వెంటనే గాయానికి పై వైపు క్లాత్‌‌‌‌తో కట్టు కట్టాలి. టెన్షన్‌‌‌‌ పడకుండా వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌‌‌‌కు వెళ్లాలి. ఇప్పటికీ కొందరు పాము కాట్లకు మంత్రాలు, చెట్ల పసర్ల పేరుతో టైం వేస్ట్‌‌‌‌ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. జిల్లాలోని సీహెచ్‌‌‌‌సీలతోపాటు పీహెచ్‌‌‌‌సీల్లోనూ యాంటీ స్నేక్ వీనం(ఏఎస్‌‌‌‌వీ) అందుబాటులో ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

ఇటీవల కొన్ని మరణాలు..


రెండు రోజుల కింద కాల్వ శ్రీరాంపూర్​ మండల కేంద్రానికి చెందిన సుదాటి రమ తన పొలంలో పనులు చేస్తుండగా పాము కాటేసింది. పొలం ఊరికి దూరంగా ఉండటంతో హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లే లోగా చనిపోయింది.
 గత నెలలో ఓదెల మండలం రూప్​నారాయణపేట గ్రామానికి చెందిన అక్షత అనే డిగ్రీ విద్యార్థిని తన ఇంటి ఆవరణలో పాము కాటుకు గురైంది. చికిత్స కోసం కరీంనగర్​కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో 
చనిపోయింది.