- ఎమ్మెల్యే కోరం కనకయ్య
- కామేపల్లి పెద్ద చెరువులో చేప పిల్లల విడుదల
- ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో సమీక్ష
కామేపల్లి, వెలుగు : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్య శాఖ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని, మత్స్యకారులకు పలు పథకాలు వర్తింపచేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వెల్లడించారు. సోమవారం కామేపల్లిలో మండలంలోని చెరువులకు 9,25, 095 చేప పిల్లలను వివిధ గ్రామాల మత్స్య శాఖ సభ్యులకు పంపిణీ చేశారు.
అంతకుముందు కామేపల్లి పెద్ద చెరువులో ఆయన చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేపల ఉత్పత్తి ద్వారా సంఘ సభ్యులంతా లాభాలు గడించాలన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఎం జిల్లా నాయకుడు దుగ్గి కృష్ణను ఇంటికి వెళ్లి పరామర్శించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఎమ్మెల్యే వెంట మత్స్య శాఖ ఏడీఏ శివప్రసాద్ తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీవో రవీందర్ డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, కామేపల్లి కొండాయిగూడెం సొసైటీ చైర్మన్లు పుచ్చకాయల వీరభద్రం, డి హనుమంతరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాలోత్ బావ్ సింగ్ ఉన్నారు.
