పటిష్టమైన పాలన పక్కా ప్రణాళిక..రెండేండ్ల వ్యూహాత్మక చర్యలతోనే సక్సెస్  

పటిష్టమైన పాలన పక్కా ప్రణాళిక..రెండేండ్ల వ్యూహాత్మక చర్యలతోనే సక్సెస్  
  • సిటీలో 100 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లే లక్ష్యం
  • బ్లూమ్​బర్గ్ కథనంపై 
  • ఎక్స్​లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి పోస్ట్

హైదరాబాద్‌‌, వెలుగు:  భాగ్యనగరం వేగవంతమైన అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని ప్రఖ్యాత అంతర్జాతీయ వార్తా సంస్థ ‘బ్లూమ్‌‌బెర్గ్’ ప్రశంసించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పటిష్టమైన పాలన, పక్కా ప్రణాళికలతో కూడిన నిర్ణయాల వల్లే రాష్ట్రంలో ఈ తరహా ఊహించని మార్పు సాధ్యమైందని సోమవారం ‘ఎక్స్‌‌’ పోస్టులో పేర్కొన్నారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక చర్యల కారణంగా వినోద రంగ దిగ్గజాలు నెట్‌‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, బ్యూటీ బ్రాండ్ లోరియల్, హెల్త్‌‌కేర్ విభాగానికి చెందిన ఆమ్‌‌జెన్, ఎలీ లిల్లీలతో పాటు ఎఫ్‌‌ఎంసీజీ రంగానికి చెందిన యూనిలీవర్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌‌లో కార్యకలాపాలు ప్రారంభించాయని స్పష్టం చేశారు.

ఈ ఏడాది నగరం లక్ష్యంగా పెట్టుకున్న 100 కొత్త గ్లోబల్ కెపెబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు ప్రక్రియ అనుకున్న సమయం కన్నా వేగంగా ముందుకెళ్తోందని వివరించారు. ప్రతిష్టాత్మక 'భారత్ ఫ్యూచర్ సిటీ' ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ సంస్థలు, స్థానిక నైపుణ్యం కలిగిన యువతను ఒకే వేదికపైకి తెచ్చే ప్రపంచ స్థాయి వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని, తెలంగాణ కేవలం పెట్టుబడులను ఆహ్వానించడమే కాకుండా ప్రపంచ పరిశ్రమల భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి ఎదిగిందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.