- ఫార్ములా ఈ రేసు కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
- మెస్సీతో మ్యాచ్‌కు సర్కారు పైసా ఖర్చు పెట్టలే
- నా మనుమడిని క్రీడాకారుడ్ని చేయాలన్నది నా కోరిక.. అందుకే మెస్సీ మ్యాచ్‌కు తీసుకెళ్లిన
- ఫ్యూచర్ సిటీలో 3 వేల ఎకరాల్లో భారీ జూపార్క్ అభివృద్ధి చేస్తం
- కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తున్నట్లు వెల్లడి
- మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఓడించేందుకు ఆ పార్టీలోనే హరీశ్ రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారు. గతంలో నేను కేసీఆర్‌ను ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఓడించాను. కేటీఆర్, హరీశ్ రావు, కవితనే కాదు.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సీఎం కావచ్చు’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, పాలన, అభివృద్ధి అంశాలపై పలు కీలక విషయాలను పంచుకున్నారు. మెస్సీ మ్యాచ్‌కు కుటుంబంతో వెళ్లడంపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ‘‘నా మనుమడిని క్రీడాకారుడిని చేయాలన్నది నా కోరిక. అందుకే మెస్సీ మ్యాచ్‌కు తీసుకెళ్లా. అదొక ప్రైవేట్ ఈవెంట్. నేను గెస్ట్‌గా మాత్రమే వెళ్లాను.
ఈ పర్యటనకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇక గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు భద్రాచలంలో ప్రొటోకాల్ ప్రకారం తాను ఏం చేయాల్నో వాటిని తన మనుమడితో చేయించారు” అని ఆయన పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ విచారణకు సంబంధించి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) నుంచి అనుమతి రావాల్సి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ అనుమతి వచ్చిన వెంటనే ఆయనతోపాటు మాజీ మంత్రి కేటీఆర్, మిగిలిన వారిపై ఒకేసారి చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు.
ఐఏఎస్‌ల కొరత
రాష్ట్రంలోని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో లెక్కలు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉందని, ఉన్నవారితోనే ఒక్కొక్కరికి రెండు మూడు బాధ్యతలు అప్పగించి నెట్టుకురావాల్సి వస్తున్నదన్నారు.
ఎయిర్‌పోర్టు కేంద్రంగానే అభివృద్ధి
రాష్ట్రంలో భవిష్యత్తు అభివృద్ధి అంతా శంషాబాద్ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ కేంద్రంగానే జరుగుతుందని సీఎం తెలిపారు. ‘‘ఫ్యూచర్ సిటీలో 3 వేల ఎకరాల్లో భారీ జూపార్క్ అభివృద్ధి చేస్తాం. గేమింగ్ స్టేడియాలను అక్కడే ఏర్పాటు చేస్తాం. ఏ పని చేపట్టినా గ్లోబల్ టెండర్ల ద్వారానే పారద ర్శకంగా ముందుకు వెళ్తాం’’ అని చెప్పారు. జీహెచ్‌ఎంసీని మరింత సమర్థంగా తీర్చిదిద్దేం దుకు, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం డివిజన్ల సంఖ్యను 300కు పెంచనున్నట్లు తెలిపారు.
