నువ్వు ఎప్పుడంటే అప్పుడే.. మేడిగడ్డ చూసొద్దామా : కేసీఆర్కు.. సీఎం రేవంత్ సవాల్

నువ్వు ఎప్పుడంటే అప్పుడే.. మేడిగడ్డ చూసొద్దామా : కేసీఆర్కు.. సీఎం రేవంత్ సవాల్

ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫిబ్రవరి 13న మేడిగడ్డకు రావాలని, బీఆర్ఎస్ నేతలకు ఆ రోజు కుదరకపోతే డేట్ కూడా మార్చేందుకు తాము సిద్దమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.   అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. మీడియాతో చిట్ చాట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..  మేడిగడ్డకు వెళ్లేదే ఫ్లోర్ లీడర్ కోసమేనని చెప్పారు. ఫ్లోర్ లీడర్ రాకపోతే ఎవరు వస్తారో ప్రతిపక్ష నేత చెప్పాలన్నారు.  

మేడిగడ్డ పై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్న  సీఎం  రేవంత్ ...జుడిషియల్ ఎంక్వైరీలో దోషులు ఎవరో తేలుతారని చెప్పారు.  ఇరిగేషన్ శాఖపై అసెంబ్లీలో  శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని..  కాగ్ నివేదిక సైతం పెడతామన్నారు.  ఇరిగేషన్ శాఖలో గతంలో రూ.16వేల కోట్లు అప్పులు కట్టారన్న సీఎం..   అక్కర లేకున్నా పిలిచిన టెండర్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.  అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ పై విచారణకు అదేశిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శ్యాండ్ పాలసీపై త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు. 

20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారన్న  జగ్గారెడ్ది వ్యాఖ్యలపై  సీఎం రేవంత్ రెడ్డి  స్పందించారు.  ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చే అంశం తన  దృష్టిలో లేదని..  అది పార్టీ చూసుకుంటుందని చెప్పారు. తమ పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకు వస్తే కలుపుకుని పోతామని స్పష్టం చేశారు.  హరీష్ రావు తన భాషపై విమర్శలు ఎందుకు చేస్తున్నారని.. తాను తెలంగాణ భాష మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పారు.  కౌన్సిల్ లో క్షమాపణ చెప్పే అంశాన్ని  సభా అధికారులు చూసుకుంటారని సీఎం తెలిపారు.