ధరణిలో పెండింగ్​ అప్లికేషన్లు క్లియర్​ చేయండి: సీఎం రేవంత్​ రెడ్డి

ధరణిలో పెండింగ్​ అప్లికేషన్లు క్లియర్​ చేయండి: సీఎం రేవంత్​ రెడ్డి

ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. 

ధరణి కమిటీతో శనివారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డి సమీక్షించారు.  ధరణిలో ఇప్పుడున్న లోపాలు, సమస్యలన్నీ మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సీఎం సూచించారు.   సీసీఎల్ఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీకి గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఎందుకు అప్పగించిందని, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల భూముల రికార్డులు మొత్తం విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని అధికారులతో సీఎం రేవంత్​రెడ్డి చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం స్పష్టం చేశారు.