టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు
  • సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలతో ఏర్పాటుకు కసరత్తు
  • చైర్మన్ తో పాటు 12 మంది కమిటీ సభ్యులు 
  • కమిటీలో ఎండోమెంట్​కమిషనర్, ఆలయ ఈవో 
  • త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం

హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట ప్రత్యేక పాలక మండలి బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం యాదగరిగుట్టలో జరిపిన సమీక్ష సమావేశంలో బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ బోర్డు తరహాలో ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. దీనిపై మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఎండోమెంట్,  యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్​మెంట్ అథారిటీ (వైటీడీఏ) అధికారులు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే, బోర్డు ఏర్పాటు, అందులో ఎంత మంది సభ్యులు ఉండాలనేదానిపై అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. చైర్మన్, మరో 12 మంది సభ్యులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. సభ్యులతోపాటు ఎండోమెంట్​ కమిషనర్, ఆలయ ఈవో ఉంటారు. కాగా, బోర్డుకు సంబంధించిన విధి విధానాలు.. చైర్మన్​గా ఎవరిని నియమించాలి? సభ్యులుగా ఎవరిని తీసుకోవాలి? వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి?అనే దానిపై సర్కార్ కసరత్తు చేస్తున్నది. టీటీడీ బోర్డు ఏర్పాటులో ఎలాంటి విధానం అవలంబించారు? యాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటు, సభ్యుల నియామకంలో ఎలాంటి విధానం అనుసరించాలనే దానిపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే యాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటుపై అన్ని అంశాలను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసే చాన్స్​ ఉంది.

యాదగిరి గుట్ట మరింత అభివృద్ధి.. 

యాదగిరి గుట్ట బోర్డును సెప్టెంబర్​లోనే ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా వాయిదా పడింది. శుక్రవారం గుట్టలో జరిగిన సమావేశంలో బోర్డు ఏర్పాటు చేయాలని, విధివిధానాలు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించడంతో ఈ ప్రక్రియలో వేగం పుంజుకున్నది. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్​ హైదరాబాద్​కు దగ్గర ఉంది. ఓఆర్ఆర్​కు సమీపంలో ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు ఈ గుడికి వస్తుంటారు. దీంతో టీటీడీ తరహాలో బోర్డు ఏర్పాటు చేస్తే యాదగిరి గుట్ట పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని సర్కారు భావిస్తున్నది.

దీంతో ఆలయ నిర్మాణంతోపాటు ఇప్పటి వరకు జరిగిన పనులు, కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి పనులు, కేటాయించిన నిధులు, పెండింగ్​ పనులు, ఇంకా అదనంగా చేయాల్సిన పనులు, టెంపుల్​లో కల్పించాల్సిన సౌకర్యాలు, భక్తులకు ఏర్పాట్లు  తదితర అంశాలను సర్కారు పరిశీలించనున్నది. ఓవరాల్​గా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత యాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిసింది.