అధికారాన్ని వ్యక్తిగత కక్షలకు వాడను.. సీఎంగా వచ్చిన గొప్ప అవకాశం ప్రజలకే ఉపయోగిస్త: సీఎం రేవంత్రెడ్డి

అధికారాన్ని వ్యక్తిగత కక్షలకు వాడను.. సీఎంగా వచ్చిన గొప్ప అవకాశం ప్రజలకే ఉపయోగిస్త: సీఎం రేవంత్రెడ్డి
  • కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా.. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులవుతారు 
  • సీఎంగా వచ్చిన గొప్ప అవకాశం ప్రజలకే ఉపయోగిస్త: సీఎం రేవంత్​రెడ్డి
  • భవనాలు, కట్టడాలు కాదు..  పేదవాడి సంక్షేమమే నిజమైన అభివృద్ధి
  • ఉద్యమకారులమని చెప్పుకొని కొందరు టీవీలు, పేపర్లు, ఫామ్‌హౌస్‌లు, వేల కోట్లు సంపాదించుకున్నరు
  • గద్దర్​, అందెశ్రీ, గూడ అంజన్న, గోరటి వెంకన్న లాంటి అసలైన ఉద్యమకారులు సర్వం కోల్పోయారు
  • ఆధ్యాత్మికవేత్త శ్రీరామ్​ రచించిన ‘హసిత బాష్పాలు’ పుస్తకావిష్కరణలో వ్యాఖ్యలు

హైదరాబాద్​, వెలుగు: సీఎంగా తనకు వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని ప్రజల సంక్షేమం కోసమే ఉపయోగిస్తానని, వ్యక్తిగత కక్ష సాధింపులకు ఉపయోగించుకోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘నాకు ఎవరో నచ్చలేదనో, నాకు ఎవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముత. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులవుతారు” అని తెలిపారు. ఆధ్యాత్మికవేత్త శ్రీరామ్ రచించిన, ప్రజాకవి అందెశ్రీ ప్రచురించిన ‘హసిత బాష్పాలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్​లోని టీజీ జెన్‌కో ఆడిటోరియంలో నిర్వహించారు. పుస్తకాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను మీలో ఒకడిని. నాకు ఈ అవకాశం ఎంతకాలం నా చేతిలో ఉంటే అంతకాలం పేదవాళ్ల కోసం ఉపయోగిస్తా తప్పితే నా వ్యక్తిగత ప్రయోజనానికి వాడను. అది ఐదేండ్లా.. పదేండ్లా నాకు తెలియదు” అని అన్నారు. అనుకున్న పని అనుకున్న సమయానికి జరగకపోతే ఒక్కోసారి తనకు కోపం వస్తుందని, అట్ల కోపం వచ్చినప్పుడు తక్కువగా మాట్లాడతానని, తక్కువ మందిని కలుస్తానని తెలిపారు. తాను జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగేందుకు దేవుడు ఏదో ఒక పర్పస్ కోసమే అవకాశం ఇచ్చి ఉంటారని విశ్వసిస్తుంటానని చెప్పారు.

‘‘నా గెలుపు వారి దుఃఖానికి కారణమైంది. అంతకంటే ఎక్కువ బాధను నేను వారికి కలిగించలేను. నేను ఆ కుర్చీలో కూర్చోవడం, సంతకం పెట్టడమే వారి గుండెలపై గీత గీసినట్లు ఉంటుంది” అని బీఆర్​ఎస్​ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వివిధ హోదాల్లో కేవలం 17 సంవత్సరాల్లోనే అన్ని చట్టసభల్లో పని చేయడానికి అవకాశం లభించిందని, ఇది తనకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశమని ఆయన అన్నారు.  

ఎవరైనా కలువవచ్చు.. సమస్యలు చెప్పుకోవచ్చు
భవనాలు, కట్టడాలు కట్టడం అభివృద్ధి కాదని.. చివరి పేదవాడికి సంక్షేమం చేరినప్పుడే అది నిజమైన అభివృద్ధి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదు.. సంక్షేమం చివరి పేదవాడికి చేరినప్పుడే అది విజయం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అదే నేను నమ్ముతా. నాలుగున్నర లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు, మూడు కోట్ల పది లక్షల మందికి సన్నబియ్యం, లక్షలాది మందికి రేషన్ కార్డులు ఇవ్వడం ద్వారా ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాం” అని తెలిపారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, భారత స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరిగే నాటికి దేశ సంపదలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.

‘‘109 దేశాల ప్రపంచ సుందరీమణులతో పాటు ఆ దేశ ప్రజల్ని జయ జయహే తెలంగాణ గీతం పాడించాను. కట్టడాలు ఎవరైనా కట్టగలరు. కానీ అందెశ్రీ వంటి కవి రాసిన గీతాన్ని ప్రపంచ వేదికపై పాడించడం తెలంగాణ సంస్కృతికి తార్కాణం” అని పేర్కొన్నారు. గతంలో సీఎంను చూడటం ఒక గొప్ప విషయంగా ఉండేదని, కానీ తాను సీఎంగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. ‘‘ఇప్పుడు ఎవరైనా సీఎంను కలువవచ్చు. సమస్యలను చెప్పుకోవచ్చు. ప్రతిరోజూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం” అని సీఎం అన్నారు.  

వాళ్లకు దురాశ వల్ల ఉన్నది పోయింది
కొందరు తాము ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఉంటారని, కానీ నిజమైన ఉద్యమకారుడు ఎవరో తెలుసుకోవాలని సీఎం రేవంత్​రెడ్డి  అన్నారు. ‘‘చెగువేరా నుంచి మొదలుపెట్టి అందెశ్రీ వరకు ఎంతోమంది ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి, లక్షలాది మందిని ఉద్యమ బాటలో నడిపించి విజయం సాధించారు. అయితే, ఈ క్రమంలో వారు ఆస్తులు, అంతస్తులు కోల్పోయి, వారి కుటుంబాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కానీ, కొంతమంది మాత్రం తాము ఉద్యమకారులం అని చెప్పుకుంటూ టీవీలు, పేపర్లు, ఫామ్‌హౌస్‌లు, వేల కోట్ల పెట్టుబడులు సంపాదించుకున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న తేడా అందెశ్రీ లాంటి వాళ్లు చెప్పాలి. రాజకీయ ప్రయోజనాలను అంచనా వేసుకొని, అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, దురాశతో దేశానికి నాయకత్వం వహించాలని బయలుదేరిన కొందరి వల్ల రాష్ట్రంలో ‘ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది’ అనే పరిస్థితి వచ్చింది” అని కేసీఆర్​ను ఉద్దేశించి సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు.

అందెశ్రీ, గద్దర్ వంటి నిజమైన నాయకులు ప్రజల స్వేచ్ఛను ఆశించి, ప్రజలకు ప్రేరణ ఇచ్చే సంకల్పంతో తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపించారని ఆయన తెలిపారు. తెలంగాణ సమాజం కవులకు, పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన గడ్డ అని అన్నారు. గూడ అంజన్న, దాశరథి, కాళోజీ, అందెశ్రీ, గద్దర్, గోరటి వెంకన్న వంటి కవులు తమ పోరాట స్ఫూర్తితో ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడానికి సర్వం కోల్పోయి అండగా నిలబడ్డారని  సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. పుస్తకావిష్కరణలకు తాను అరుదుగా వెళ్తుంటానని, రాజకీయ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అయితే, అందెశ్రీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘అందెశ్రీ  ఈ పుస్తక రచయిత శ్రీరామ్​ గొప్ప వ్యక్తి అని చెప్పినప్పుడు, ఖచ్చితంగా వారిని కలవాలి, ఆ పుస్తకావిష్కరణలో పాల్గొనాలని నిర్ణయించుకున్న” అని సీఎం రేవంత్​రెడ్డి వివరించారు.

హైదరాబాద్​లో శిబూ సోరెన్ భవన్ నిర్మిస్తం: రేవంత్ రెడ్డి
జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం పార్టీ వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ స్మారకార్థం హైదరాబాద్ లో శిబూ సోరెన్ భవన్ ను నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ నిధులతో ఈ నిర్మాణం చేపడ్తామని చెప్పారు. శిబూ సోరెన్ ఈ నెల 4న 81 ఏండ్ల వయసులో కన్నుమూశారు. శనివారం ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లారు. అక్కడి నుంచి సోరెన్ స్వగ్రామం రామ్ గఢ్ జిల్లాలోని నమ్రాకు వెళ్లిన సీఎం.. సంప్రదాయ గిరిజన ఆచారాలతో నిర్వహించిన శ్రద్ధాంజలి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోరెన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. బిర్సా ముండాను ఆదర్శంగా తీసుకున్న శిబూ సోరెన్ తన జీవితాంతం జార్ఖండ్ ప్రజల కోసం కృషి చేశారని కొనియాడారు.

జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 26 ఏండ్లు పోరాటం చేశారని.. జార్ఖండ్ ఏర్పాటు తర్వాతే తెలంగాణ ప్రజలు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలమనే నమ్మకాన్ని పొందారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన తెలంగాణలో పర్యటించి ప్రజలకు అవసరమైన చోట సహాయం అందించారని సీఎం గుర్తు చేశారు. సోరెన్ కుటుంబానికి కాంగ్రెస్ కుటుంబమంతా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా శిబూ సోరెన్ కొడుకు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో పాటు కుటుంబ సభ్యులను రేవంత్ పరామర్శించారు. సీఎం వెంట ఎంపీలు రఘువీర్, అనిల్​ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఉన్నారు.