
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో భాగంగా త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ రెడ్డి పుణ్య స్నానం చేశారు. జ్ఞాన సరస్వతీ పుష్కరఘాట్ లో ఆయనతో పాటు మంత్రులు పొంగులేటి, పొన్నం, శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు పుష్కర స్నానం చేశారు. అంతకు ముందు జ్ఞాన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు.
సరస్వతి నది పుష్కరాలు మే 15న ప్రారంభం కావడంతో తెలంగాణలోని కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం పుష్కర శోభ సంతరించుకుంది. మే 15న ఉదయం తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుష్కర స్నానాలు ప్రారంభం అయ్యాయి. సరస్వతీ పుష్కరాలు మే 26 వరకు సాగనున్నాయి. కాళేశ్వరం వద్ద త్రివేణీ సంగమంలో పుష్కర స్నానం.. ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తుల రాకపోకల దృష్ట్యా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈ ప్రాంతంలో మొదటిసారిగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి.
పుష్కరాల సమయంలో ప్రతి రోజూ దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజూ సాయంత్రం 6.45 గంటల నుంచి 7.35 వరకు సరస్వతి నవరత్న మాల హారతి నిర్వహిస్తారు.అదనంగా, సాంస్కృతిక, కళాపరమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.