బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ : సీఎం రేవంత్​రెడ్డి 

బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ : సీఎం రేవంత్​రెడ్డి 
  • ఎస్సీ వర్గీకరణపై ఆ పార్టీ హామీ వట్టిదే
  • సామాజిక సమతుల్యత కాంగ్రెస్​తోనే సాధ్యం
  • మాదిగల అభివృద్ధి, సంక్షేమం మా బాధ్యత
  •  పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు న్యాయం చేస్తామని హామీ

హైదరాబాద్, వెలుగు : దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ అని, మాదిగలు ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీ వట్టిదేనని, చిత్తశుద్ధి ఉంటే గత పదేండ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్​ దళితుల పార్టీ. దశాబ్దాలుగా సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నది. ఎందరో దళితులకు అవకాశాలు కల్పించింది. భవిష్యత్తులో కూడా కల్పిస్తుంది” అని ఆయన తెలిపారు. దళితుల కోసం ఇన్నేళ్లు కాంగ్రెస్​ ఏం చేసిందో జనంలోకి వెళ్లి చెబుదామని, వాస్తవాలను వివరిద్దామని పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎజెండాతోనే పార్లమెంట్​ ఎన్నికల్లో దళితుల ఆదరణ పొందాలని ఆయన అన్నారు.

ఆదివారం ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్​కుమార్, పీసీసీ జనరల్​ సెక్రటరీ చారగొండ వెంకటేశ్​తో ఆయన తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ ఉపకులాల సమతుల్యత, సామాజిక న్యాయం అనే అంశంతోపాటు ఎస్సీ వర్గీకరణపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీ వట్టిదేనని, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే గత పదేండ్లలో ఎందుకు చేయలేదో ఆ వర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని రేవంత్​ అభిప్రాయపడ్డట్టు సమాచారం.

ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీయే ఈ అంశంపై ఉషా మెహ్రా కమిషన్​ వేసి న్యాయం చేసే ప్రయత్నం చేసిందన్నారు. బీజేపీ సర్కార్​కు చిత్తశుద్ధి ఉంటే ఇంతకాలం కాలయాపన చేయకుండా 341 ఏ ఆర్టికల్​ను సవరించి రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అంశాన్ని కట్టబెట్టేదని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున కాంగ్రెస్  చిత్తశుద్ధితో, నిబద్ధతతో ముందుకు సాగుతున్నదని.. అందుకు తన వంతుగా చేయాల్సిన సహకారం అందిస్తానని సీఎం రేవంత్​ హామీ ఇచ్చారు.  ‘‘బీజేపీ భావజాల పరంగానే దళిత వ్యతిరేక పార్టీ. మాదిగలు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదు” అని ఆయన అన్నట్టు తెలిసింది.

దళిత సంక్షేమం, ఉప కులాలకు న్యాయం కాంగ్రెస్​తోనే సాధ్యమని పేర్కొన్నారు. పార్టీపై వ్యతిరేక ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహం సిద్ధం చేయాలని నేతలకు సూచించినట్లు సమాచారం. వందరోజుల పరిపాలనలో అన్ని ప్రభుత్వ నియామకాల్లో  సామాజిక న్యాయం పాటించామని తెలిపారు. మాదిగల అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు తమ బాధ్యత అని హామీ ఇచ్చారు  ‘‘కాంగ్రెస్​ చేసింది చెబితే చాలు దళిత సమాజం వాస్తవం తెలుసుకుంటుంది’’ అని ఆయన సూచించినట్టు తెలిసింది. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లందరినీ గుర్తుంచుకుంటామని, వాళ్లకు తగిన సమయంలో తగిన రీతిలో న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం.