నన్ను గుండెల్లో పెట్టుకుని.. దేశానికి పరిచయం చేసింది: సీఎం రేవంత్ భావోద్వేగం

నన్ను గుండెల్లో పెట్టుకుని..  దేశానికి పరిచయం చేసింది: సీఎం రేవంత్ భావోద్వేగం

హైదరాబాద్: మల్కాజ్‌గిరి గడ్డ.. నన్ను  గుండెల్లో పెట్టుకుని..  దేశానికి పరిచయం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి  గురయ్యారు.  తెలంగాణలో 12మంది మంత్రులతో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మిగిలిన ఆరు మంత్రి పదవుల విషయంపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.  తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్ కు వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు సీఎం రేవంత్. అనంతరం  తన రాజీనామా పత్రాన్ని ఆయనకు సమర్పించారు.  2018 మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.

 

 

శుక్రవారం ఎంపి పదవికి రాజీనామా చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి..మల్కాజ్‌గిరి నియోజకవర్గ ప్రజలకు భావోద్యేగంతో కూడిన బహిరంగ లేఖ రాశారు.   తెలంగాణలో ప్రశ్నించే గొంతుకే లేకుండా చేయాలని పాలకులు కక్ష కట్టినప్పుడు.. రాష్ట్రంలో  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం  ప్రశ్నించే గొంతుకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్‌గిరి అని అన్నారు. కొడంగల్‌లో తన ఇంటిపై పడి, తనను నిర్భంధించిన, నడిరాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్యచేసిన సందర్భాన్ని చూసి చలించిన  మల్కాజ్‌గిరి.. కేవలం 14రోజుల వ్యవధిలోనే తనను గుండెల్లో పెట్టుకుందని,  ప్రశ్నించే గొంతుకై తెలంగాణ మొత్తానికి రక్షణగా నిలబెట్టిందన్నారు. తనను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్‌గిరి ప్రజలదేనని.. మల్కాజ్ గిరి ప్రజలకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.