కాళేశ్వరం నీళ్లు అమ్ముతామని.. రూ.97 వేల కోట్లు అప్పు చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం నీళ్లు అమ్ముతామని.. రూ.97 వేల కోట్లు అప్పు చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆసక్తికర చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై 80 వేల కోట్లు అప్పు చేసినట్లు చెప్పిన మాజీ ఆర్థిక మంత్రి.. హరీశ్ రావు.. వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిండు సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని స్పష్టం చేసిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం నీళ్ల విషయంలో చేసిన అప్పుల వివరాలను వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. దాన్ని ద్వారా 97 వేల 449 కోట్ల రూపాయల అప్పు మంజూరు చేయించుకున్నట్లు వెల్లడించారు. అందులో  79 వేల 287 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని.. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఖర్చు చేసిందని.. ఈ అప్పులన్నీ కాళేశ్వరం పేరుతో చేసినవే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అప్పు మంజూరు కావటానికి.. నిధుల రాక వెనక ఉన్న అసలు విషయాన్ని సైతం వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత.. ఆ నీళ్లను రైతులకు, పరిశ్రమలకు, మంచినీళ్లకు సరఫరా చేసి డబ్బులు వసూలు చేస్తామని.. దీని వల్ల ఏడాదికి కాళేశ్వరం నీళ్ల ద్వారా 5 వేల 199 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి.. అప్పులు చేసినట్లు నివేదికలు బయటపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి..

ఇక మిషన్ బగీరథ విషయంలోనూ ఇదే జరిగిందని.. మిషన్ బగీరథ నీళ్లు అమ్మటం ద్వారా ఏడాదికి 5 వేల 706 కోట్ల రూపాయలు వస్తాయని.. ఆ నీళ్ల అమ్మకం ద్వారా అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి.. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చినట్లు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎంత ఖర్చు చేసింది.. పూర్తి వివరాలను.. పూర్తి అప్పుల వివరాలను ఈ సభలో.. త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.