గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతలు సర్పంచ్లకే: సీఎం రేవంత్

గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతలు సర్పంచ్లకే: సీఎం రేవంత్

వచ్చే వేసవిలో లాగునీటి సమస్య లేకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్ శాఖపై సమీక్షించిన సీఎం కీలక సూచనలు జారీ చేశారు. కేవలం కృష్ణా, గోదావరి నదుల నుంచి రాష్ట్రమంతా నీళ్లు ఇవ్వడం కాకుండా.. కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించాలని సూచించారు.

గ్రామాల్లోతాగునీటి నిర్వాహణ బాధ్యతలు సర్పంచ్ లకు అప్పగించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వందకు వందశాతం గ్రామాల్లో తాగునీరు అందించామని గత ప్రభుత్వం గొప్పలతో నష్టమే జరిగిందన్నారు సీఎంరేవంత్ రెడ్డి.

రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని వాళ్లకు ఆర్థికంగా చేయూతను అందించే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టల్ విద్యార్థులు,పోలీసులకు అందించే యూనిఫాంలు కుట్టించే పనిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. 422 గ్రామ పంచాయతీలు, 3177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదన్నారు అధికారులు. రోడ్డు కనెక్టివిటీలేని గ్రామాల్లో యుద్ధప్రాతిపాదికన తారు రోడ్లు వేయాలని ఆదేశించారు. ఈ బడ్జెట్ లో అవసరమైన నిధులను సమకూర్చుతామన్నారు.