తప్పులు ఒప్పుకోక ఎదురు దాడా..?ఈ పాపాలకు మామా అల్లుండ్లే కారణం

తప్పులు ఒప్పుకోక ఎదురు దాడా..?ఈ పాపాలకు మామా అల్లుండ్లే కారణం
  • మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వద్దని రిటైర్డ్ ఇంజినీర్ల నివేదిక 
  • పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్ కు
  • ఏ దేవుడు కలలకు వచ్చి చెప్పాడో..?
  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన తప్పులను ఒప్పుకోకుండా హరీశ్ రావు ఎదురు దాడికి దిగడం కరెక్ట్ కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారు చేసిన తప్పులను ఒప్పుకొని సలహాలు ఇస్తే కొంత మేరకైనా సమాజం అంగీకరించేదన్నారు. ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్బంగా జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై ఐదుగురు రిటైర్డ్ ఇంజినీర్లతో కమిటీ వేసిందని, ఆ కమిటీ 14 పేజీల నివేదిక ఇచ్చిందని సీఎం చెప్పారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే నిరుపయోగమని పేర్కొందని అన్నారు.  దానిని పక్కన పెట్టి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టారన్నారు. అక్కడ ప్రాజెక్టు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్ కు అని అన్నారు. ఆయనకు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియదన్నారు. ఆయనే ఇంజినీర్లకు సలహా ఇచ్చి మేడిగడ్డ దగ్గ బ్యారేజీ కట్టారని అన్నారు.  మామా, అల్లుండ్లు కలిసి తెలంగాణ ఖాజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగపడ్డారని అన్నారు. కేసీఆర్ , హరీష్ కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో వాళ్లు తెలుసుకోవాలని అన్నారు. కాళేశ్వరం తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందని చెప్పారు.  క్షమాపణలు చెప్పాల్సిందిపోయి నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని అన్నారు. ప్రాజెక్టులు పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా.. ఇంకా వాదిస్తారా? అన్నారు. ‘హరీష్ రావును నేను నిలదిస్తున్నా.. ఈ దుర్మార్గాలకు కారణం మీరు..ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు... తొండి వాదనలు వద్దు..’ అన్నారు. 

ధర్నాలు చేసిన సబితక్క మారిపోయారు

చేవెళ్లలో ప్రాజెక్టు ఆపితే ఆనాడు ధర్నా చేసిన మా అక్క సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు మారిపోయారని, వారి పక్కనే ఉన్నారని అన్నారు. ‘ఆనాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క.. ఈనాడు హరీష్ రావు గారిని సమర్ధిస్తున్నారా?’ అని ప్రశ్నించారు. జరిగిన తప్పులకు హరీశ్ క్షమాపణ చెప్పి... సిట్టింగ్ జడ్జి విచారణకు వచ్చినపుడు ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో కన్ఫెక్షన్ స్టేట్ మెంట్ ఇచ్చి ఒప్పుకోవాలి.’ అని అన్నారు. 

పొన్నం, వివేక్, అంజన్ కొట్లాడిండ్రు (బాక్స్)

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అంజన్ కుమార్ యాదవ్ కొట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధనలో  కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు.