- ఈ నెల 14న రెండో విడత ఇంటిగ్రేటెడ్
- రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- వచ్చే విద్యా సంవత్సరంలోగా వాటి నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడి
- డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుపై సీఎంకు ధన్యవాదాలు తెలిపిన వైరా, మధిర గురుకుల స్టూడెంట్లు
హైదరాబాద్, వెలుగు: రెండో విడత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఈ నెల 14న మంజూరు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే రోజు15 వేల మందితో ఒక మంచి కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీల కోసం ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులను వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.
డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపు నేపథ్యంలో బుధవారం సెక్రటేరియెట్‌లో వైరా, మధిర నియోజకవర్గాలకు చెందిన గురుకుల విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడారు. ‘‘నాణ్యమైన చదువు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. సామాజిక న్యాయం అందించేందుకే ప్రభుత్వం కుల గణన సర్వే చేస్తోంది. రాష్ట్రంలో 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించడంతో పాటు 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశాం.
చదువుతో పాటు నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయి. అందుకే విద్యార్థి, నిరుద్యోగుల కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. టాటా ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం”అని సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రామసాయం రఘురాం రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి..
విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా మారి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం సూచించారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో సెక్రటేరియెట్‌లో అడుగుపెట్టి పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనమవుతాయని గంజాయి, డ్రగ్స్ ఎక్కడ కనిపించినా డయల్ 100కు ఫోన్ చేయాలని చెప్పారు.