- హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తం: సీఎం రేవంత్
- నివేదిక ఆధారంగా ముందుకు.. బడ్జెట్ సమావేశాల్లో విధివిధానాలు ఖరారు
- గత పాలకుల ఇష్టారాజ్యం వల్ల అస్తవ్యస్తంగా జిల్లాల స్వరూపం
- లీడర్ల కోసం ఊరికో మండలం.. నియోజకవర్గానికో జిల్లా!
- ఒక మండలం జనాభా 4 వేలు.. మరొకటి లక్షన్నర.. ఇదేం పద్ధతి?
- అప్పులు, తప్పులు మాకు బదిలీ చేసి ఫామ్‌హౌస్‌లో పడుకున్నరు
- సీఎంగా రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా .. ప్రజలపై కొత్తగా
- పన్నుల భారం మోపం.. ఎగవేతదారులను ఉపేక్షించం
- నెలకు రూ. 30 వేల కోట్లు అవసరం.. ఆదాయం 18 వేల కోట్లే
- సింగరేణి తరహాలో ఉద్యోగులందరికీ రూ. కోటి
- ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడి
- టీజీవో 2026 డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: గత పాలకుల నిర్వాకం వల్ల అస్తవ్యస్తంగా మారిన జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే జ్యుడీషియల్ కమిషన్ వేయబోతున్నామని చెప్పారు. జిల్లాల పునర్విభజన, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అశాస్త్రీయంగా, హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపబోమని, కానీ పన్ను ఎగవేతదారులను మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పారు. గత పాలకుడు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, సమస్యలను పక్కనపెట్టి హాయిగా పామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. కుటుంబంలో తండ్రిని కోల్పోతే పెద్దన్న బాధ్యత తీసుకున్నట్లు, తాను రాష్ట్రానికి ఒక పెద్దన్నలా, బాధ్యతగల సోదరుడిగా అప్పులను, సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్‌లో టీజీవో (తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్) 2026 డైరీని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు పరిపాలనా సౌలభ్యాన్ని పట్టించుకోకుండా, తమకు నచ్చిన వారికి నజరానాలు ఇచ్చినట్టుగా జిల్లాలను, మండలాలను పంచిపెట్టారని మండిపడ్డారు. ఈ అస్తవ్యస్త విధానాన్ని సరిచేసేందుకు, శాస్త్రీయంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని స్పష్టం చేశారు.
ఇప్పుడు మండలం మార్చాలని, హనుమకొండ, వరంగల్‌లాంటి జిల్లాలను కలపాలంటూ ప్రజలనుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం జనాభా ప్రాతిపదికన విభజన ఉండాలని అన్నారు. ‘‘మండలమైనా, రెవెన్యూ డివిజన్ అయినా, జిల్లా అయినా.. జనాభాలో 10 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ ఒకచోట 3 లక్షలు, మరోచోట కోటి మంది ఉంటే పాలన సాధ్యం కాదు. బడ్జెట్ సమావేశాల్లో చర్చించి, అందరి సూచనలు తీసుకున్నాకే గైడ్‌లైన్స్ ప్రిపేర్ చేసి.. కమిషన్‌ను అపాయింట్ చేస్తం. అంతా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. సీక్రెట్‌గా రూమ్‌లో కూర్చొని చేసేది కాదు” అని వ్యాఖ్యానించారు.
దొరల కోటల పేర్లు మనకెందుకు?
హైదరాబాద్ పేరు మారుస్తున్నారని, జిల్లాల పేర్లు మారుస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. ‘‘హైదరాబాద్, మేడ్చల్, సైబరాబాద్ పేర్లు నేను పెట్టినవి కాదు.. తీసేసినవి కాదు. అవి యథాతథంగా ఉన్నాయి. కేవలం ‘రాచకొండ’ అనే పేరును మాత్రమే మార్చి ‘ఫ్యూచర్ సిటీ’ అని పెట్టాం. రాచకొండ అనేది పద్మనాయక రాజుల కోట. ప్రజాస్వామ్యంలో మనకు రాజుల పేర్లు, దొరల కోటల పేర్లు ఎందుకు? సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటదని, అక్కడ మనం ఒక పెద్ద నగరాన్ని నిర్మించబోతున్నాం కాబట్టి ‘ఫ్యూచర్ సిటీ’ అని పేరు పెట్టాం. అంతేకానీ సికింద్రాబాద్‌పై నాకేం కక్ష లేదు” అని అన్నారు.
మధ్యతరగతి తండ్రిలా సంసారాన్ని ఈదుతున్నా..
ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపబోమని, కానీ పన్ను ఎగవేతదారులను మాత్రం ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖల్లో జరుగుతున్న అవకతవకలను అరికడితే ప్రభుత్వానికి సరిపడా ఆదాయం వస్తుందని చెప్పారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లు, ల్యాండ్ లార్డ్స్ మధ్య జరిగే ఒప్పందాల్లో పన్ను ఎగవేత జరుగుతున్నదని, 5 వేల చదరపు అడుగులకు అనుమతి తీసుకొని 10 వేల చదరపు అడుగులు నిర్మిస్తున్నారని ఉదాహరణలతో వివరించారు. ఇలాంటి వారిని గుర్తించి అసెస్మెంట్ చేసి పన్నులు వసూలు చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. ఈ విషయంలో ఉద్యోగులు సహకరిస్తే, వచ్చే ఆదాయంతోనే జీతభత్యాలు, ఇతర బెనిఫిట్స్ సకాలంలో చెల్లించడానికి వీలవుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి ప్రతి నెలా వస్తున్న ఆదాయం కేవలం రూ. 18,500 కోట్లు మాత్రమేనని, కానీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, వడ్డీలు, సంక్షేమ పథకాల నిర్వహణకు ప్రతి నెలా రూ. 30 వేల కోట్లు అవసరమవుతున్నాయని సీఎం వివరించారు. ‘‘ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు.. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఎలాగైతే ఆదాయానికి మించి ఉన్న ఖర్చులను సర్దుబాటు చేసుకుంటుందో, మేం కూడా అలాగే తల తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నం. ఇంటి అద్దె, పాల బిల్లు, కరెంట్ బిల్లు, పిల్లల ఫీజులు, వైద్య ఖర్చుల కోసం నెల జీతాన్ని ఎలా విడగొట్టుకుంటారో, పండుగలు వచ్చినప్పుడు పంటి బిగువున కష్టాన్ని భరిస్తూ సంసారాన్ని ఎలా నెట్టుకొస్తారో.. మా ప్రభుత్వం పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది” అని వివరించారు.
గత పాలకుల నిర్వాకంతో మరింత జటిలం
గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండానే వేల కోట్ల భారాన్ని తమపై మోపి వెళ్లిపోయారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని, అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. పెండింగ్ డీఏ ఫైల్‌పై ఈ ఉదయమే సంతకం చేసి వచ్చానని ప్రకటించారు. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 227 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, ఉద్యోగుల ముఖాల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. గతంలో జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఒకటో తేదీనే ఠంచన్‌గా జీతాలు వేస్తున్నామని, ఇన్‌స్టాల్‌మెంట్లలో కాకుండా ఒకేసారి చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించామని, కానీ గత పాలకుల నిర్వాకం వల్ల సమస్యలు మరింత జటిలంగా మారాయన్నారు. రిటైర్‌మెంట్ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచడం వల్ల, తాము అధికారంలోకి రాగానే రిటైర్‌మెంట్ల సంఖ్య భారీగా పెరిగిందని, దీంతో ఒక్కసారిగా ఆర్థిక భారం పడిందని వెల్లడించారు. అధికారంతో పాటు అప్పులను, తప్పులను కూడా గత ప్రభుత్వం తమకు బదిలీ చేసిందని, ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించామని సీఎం గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు అన్నీ ఇన్నీ కావని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 11 వేల కోట్లు, కాంట్రాక్టర్ల బిల్లుల కింద రూ. 42 వేల కోట్లు, కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులు, విద్యుత్ బకాయిలు అన్నీ కలిపి లక్షా 11 వేల కోట్ల తక్షణ చెల్లింపుల భారాన్ని గత ప్రభుత్వం తమకు వారసత్వంగా ఇచ్చిందని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోనూ, కార్పొరేషన్ల ద్వారా, ఇతర మార్గాల్లో దాదాపు రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేయగా, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలన్నీ కలిపి ఏకంగా రూ. 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల భారాన్ని తమ నెత్తిన మోపారని తెలిపారు.
ఫాంహౌస్ పాలన కాదు.. ఇది ప్రజా పాలన
గత డిసెంబర్ నాటికి తాను రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్నానని, ఈ కాలంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నానని తెలిపారు. గతంలో పార్టీ అధ్యక్షుడిగా 12 గంటలు పని చేసేవాడినని, ఇప్పుడు బాధ్యత పెరగడంతో సమయం చాలడం లేదన్నారు. జయప్రద సినిమా ‘అంతులేని కథ’లో హీరోయిన్ తన కుటుంబం కోసం ఎలా త్యాగం చేసిందో, తాను కూడా రాష్ట్రం కోసం అలా పని చేస్తున్నానని అన్నారు.
10 లక్షల మంది ఉద్యోగులే ముఖ్యం
రాష్ట్రాన్ని నడిపేది కేవలం 200 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాదని, క్షేత్రస్థాయిలో పని చేసే పదిన్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి నిజమైన సారథులని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మారొచ్చు కానీ, ఉద్యోగులు శాశ్వతంగా ఉంటారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తప్పుడు నిర్ణయాలను కూడా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించారని, ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకుంటున్న సక్రమమైన నిర్ణయాలను, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, సన్నబియ్యంలాంటి సంక్షేమ పథకాలను పేదలకు చేరవేస్తున్నది ఉద్యోగులేనని కొనియాడారు. 200 మంది ప్రజాప్రతినిధులమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని అనుకుంటే అది భ్రమేనని, ఉద్యోగుల సహకారం లేనిదే అడుగు ముందుకు వేయలేమని వ్యాఖ్యానించారు.
ఉద్యోగులందరికీ రూ. కోటి ప్రమాద బీమా
సింగరేణి కార్మికులకు ఇస్తున్న తరహాలోనే.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించబోతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విధి నిర్వహణలో లేదా ప్రమాదవశాత్తు ఏ ఉద్యోగి మరణించినా, వారి కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రూ. కోటి బీమా ఇచ్చేలా త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ విషయంలోనూ ఉద్యోగులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) భవన నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఉద్యోగులు ఎంత మొత్తంలో విరాళాలు సేకరిస్తారో, దానికి సమానంగా ‘మ్యాచింగ్ గ్రాంట్’ (50:-50 నిష్పత్తిలో) ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారు. సమావేశంలో టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.
జిల్లాలంటే ఒక పద్ధతి ఉండాలి. కానీ వాళ్లు నచ్చితే నజరానా టైపులో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు చేసి పోయారు. ఇప్పుడు ఒక జిల్లాలో కేవలం ఒకే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. మరో జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది పూర్తిగా ఇర్రేషనల్. ఒక దగ్గర మండలం జనాభా లక్షన్నర ఉంటే.. మరో దగ్గర కేవలం 4 వేల జనాభాతో మండలం ఏర్పాటు చేశారు. ఓ లీడర్‌కు నచ్చితే.. ఆ లీడర్ ఊరి చుట్టూ రెండు మూడు ఎంపీటీసీలు కలిపి ఒక మండలం చేశారు. ఇలా చేయడం వల్ల పరిపాలన గాడి తప్పింది.
- సీఎం రేవంత్
రాజకీయ నిర్ణయం కాదు.. కమిషన్ వేస్తం..
జిల్లాల విషయంలో మళ్లీ రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే న్యాయం జరగదని, అందుకే నిపుణులతో కమిషన్ వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై పూర్తిస్థాయిలో చర్చిస్తం. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో.. రెవెన్యూ, ఇతర శాఖల్లో పనిచేసిన అనుభవజ్ఞులైన అధికారులతో ఒక కమిటీ వేస్తం. ఈ కమిషన్ 6 నెలలపాటు రాష్ట్రమంతటా పర్యటిస్తుంది. ప్రజల డిమాండ్ల ను స్వీకరిస్తుంది. ఏయే మండలాలు కలపాలి? ఏ జిల్లాలో ఎంత జనాభా ఉండాలి? రెవెన్యూ డివిజన్ పరిధి ఎంత ఉండాలి? అనేదానిపై ఒక ప్రాతిపదిక రూపొందిస్తారు’’ అని వివరించారు. ‘‘నేను మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ మీటింగ్‌కు వెళ్లా. స్టేజ్ మీద కూర్చున్నాం. కింద చూస్తే ఎవరూ లేరు. నేను సీఈవోను పిలిచి.. ‘ఏమయ్యా మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా.. సభ్యులంతా ఎక్కడ?' అని అడిగాను. దానికి ఆయన.. ‘సార్ అందరూ వచ్చారు.. స్టార్ట్ చేద్దాం’ అన్నాడు. ‘ఎక్కడ ఉన్నారు?’ అని నేను అడిగితే.. ‘ఇదిగో స్టేజ్ మీద ఉన్నది వాళ్లే’ అని చూపించాడు. అక్కడ ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ఒక ప్రతిపక్ష నేత మొత్తం కలిపి ఐదుగురు ఉన్నారు. అందులో నేను ఒకడిని. ఐదుగురు సభ్యులతో కూడా ఒక జడ్పీ ఉంటదా? కింద జనం లేరు.. నేను ఎవరిదిక్కు చూసి మాట్లాడాలి? అదీ గత ప్రభుత్వం చేసిన జిల్లాల విభజన తీరు’’ అని సీఎం ఎద్దేవా చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారుల మీద ఒత్తిడి తేవద్దని ప్రజలకు, ప్రజాప్రతినిధు లకు సీఎం సూచించారు. ‘‘ఏది జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుందో తేలాక.. ఆఫీసులకు స్థలాలు ఇస్తం. ఇప్పుడే ఒత్తిడి చేయకండి. కమిషన్ నివేదిక వచ్చాక, శాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేసుకుందాం’’ అని తెలిపారు.
