
- విద్యా శాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- 9-12 తరగతుల విధానంపై స్టడీ చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పాసైన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియెట్ పూర్తి చేసేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టెన్త్ క్లాస్ పాసైన వారిలో కేవలం 85% మంది స్టూడెంట్లు మాత్రమే ఇంటర్‌లో చేరుతున్నారని తెలిపారు. 15% మంది ఇంటర్‌లో జాయిన్ కాకపోవడానికి గల కారణాలను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియెట్డ్రాప్అవుట్స్15% నమోదు కావడంపై సీఎం సీరియస్ అయ్యారు. ఇతర రాష్ట్రాల్లో 9 నుంచి 12వ తరగతి వరకు విద్య కొనసాగడం వల్ల డ్రాపౌట్స్ తక్కువని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ విధానంపై స్టడీ చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని, విద్యా కమిషన్, ఎన్జీవోల నుంచి సలహాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇంటర్ విద్య మెరుగుదలపై శాసనసభలో చర్చిస్తామన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ప్రతి వారం నివేదిక సమర్పించాలని, ప్రతి స్కూల్ ఆవరణలో భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ఒక్కో పాఠశాలను నిర్మిస్తామని చెప్పారు. చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ నిర్మాణానికి సంబంధించిన టెండర్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సమీక్షలో సలహాదారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.