తెలంగాణను ముంచిందే కేసీఆర్​..ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పజెప్పిండు: సీఎం రేవంత్

తెలంగాణను ముంచిందే  కేసీఆర్​..ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పజెప్పిండు: సీఎం రేవంత్
  • మనకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి కేసీఆర్​ ధారాదత్తం చేసిండు
  • మేఘా కృష్ణారెడ్డికి ‘రాయలసీమ’ టెండర్ దక్కేలా కుట్ర చేసిండు
  • పదవులు, కమీషన్లకు లొంగిపోయి జలదోపిడీ
  • ఉమ్మడి పాలనకన్నా కేసీఆర్ పాలనలోనే తీవ్ర నష్టం 
  • అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసి ఇప్పుడు ఉద్యమాలంటున్నరు
  • ఉద్యమాలని ముందుకు వస్తే జనం చెప్పులతో కొడ్తరు
  • నీటి వాటా తేలేదాకా ప్రాజెక్టులు ఇవ్వబోమని కేంద్రానికి చెప్పినట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కేంద్రానికి ఇరిగేషన్​ ప్రాజెక్టులను అప్పజెప్పిందే కేసీఆర్​ అని, ఆ తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలని చూస్తున్నా రని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముంచిందే కేసీఆర్​ అని, అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసి ఇప్పుడు ఉద్యమాలంటూ ముందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల పేరిట కేసీఆర్​ ఫ్యామిలీ ముందుకు వస్తే జనమే చెప్పులతో కొడతారని ఆయన హెచ్చరించారు. ‘‘కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు పునాది పడింది. తెలంగాణకు కృష్ణా నీళ్లలో వాటా దక్కకుండా చేసిందే కేసీఆర్” అని తెలిపారు. ఆదివారం సెక్రటేరియెట్ లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖతో కలిసి మీడియాతో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. ఏపీ సీఎం జగన్​తో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్ మేఘా కృష్ణారెడ్డికి దక్కేలా కేసీఆర్​ కుట్ర పన్నారని, అందుకే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్ వెళ్లకుండా కాలయాపన చేశారని అన్నారు. ‘‘కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రా..! 48 గంటలే కాదు.. కోరితే అంతకన్నా ఎక్కువ సేపే చర్చించేందుకు మేం రెడీ” అని కేసీఆర్​కు సవాల్ ​విసిరారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇరిగేషన్​ను ఎలా అస్తవ్యస్తం చేశారో అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్​ చేస్తామన్నారు. ‘‘కేసీఆర్, హరీశ్​రావు, డ్రామారావు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు” అని ఆయన మండిపడ్డారు. 

‘‘రాష్ట్ర విభజన చట్టంలోనే కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను ఆయా రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు స్వాధీనం చేయాలని ఉంది. విభజన చట్టం అనే పుస్తక రచయితే కేసీఆర్. కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్ అనేకసార్లు చెప్పిండు” అని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘2015 జూన్ 18న కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉన్న 811 టీఎంసీల కేటాయింపుల్లో 50 శాతం వాటా కోసం నాడు కేసీఆర్​ ఎందుకు అడగలేదు? ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదిస్తే దానికి కేసీఆర్, హరీశ్​రావు, అధికారులు అంగీకరించి సంతకాలు చేసిన్రు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తున్నట్టు 2022లో సంతకాలు చేసిన్రు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి  ప్రాజెక్టులు అప్పగించాలని ప్రతిపాదిస్తూ వాటికి రూ.200 కోట్ల చొప్పున రూ.400 కోట్ల సీడ్ మనీ ఇస్తున్నట్టు బడ్జెట్​ డిమాండ్ బుక్కులోనే ప్రతిపాదించిన్రు. అప్పుడు కేసీఆరే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నడు..” అని చెప్పారు. 

పాలమూరును పడావు పెట్టిండు

ఐదు దశాబ్దాల సమైక్య పాలనకన్నా పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలోనే కృష్ణా నీళ్లలో తెలంగాణకు ఎక్కువ నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్​ తెలిపారు. పదేండ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేయలేదని, తాము 18 నెలల్లో ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రెండేండ్లలో పూర్తి చేస్తామన్న పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఉంటే పది లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని అన్నారు. పదేండ్లు పాలమూరును కేసీఆర్ పడావు పెట్టారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని పాపాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ప్రజా ఉద్యమాలు అని మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పాపాలు చేసి ఉద్యమాలు అంటే ప్రజలు చెప్పులతో కొడ్తరు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం అప్రాప్రియేట్ ఫోరంలలో మేము కొట్లాడుతుంటే అధికారం కోల్పోయి దిక్కు తోచక ఏదో వంకతో మామాఅల్లుళ్లు(కేసీఆర్​, హరీశ్​రావు) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నరు” అని మండిపడ్డారు. జనవరి 17న నిర్వహించిన మీటింగ్ మినిట్స్ లో తప్పులున్నాయని చెప్తూ జనవరి 27న అధికారులు కేంద్రానికి లేఖ రాశారని, కేంద్రం కర్రపెత్తనం చేస్తూ ప్రాజెక్టులు స్వాధీనం చేస్తాకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. 

జగన్..​ దమ్ముంటే ఇప్పుడు పోలీసులను పంపు

తెలంగాణ ఆధీనంలో ఉన్న నాగార్జునసాగర్ పైకి అసెంబ్లీ ఎన్నికల రోజు తుపాకులతో ఏపీ పోలీసులను జగన్ పంపితే కేసీఆర్ ఏం చేశారని రేవంత్​ నిలదీశారు. దమ్ముంటే జగన్ ఇప్పుడు పోలీసులను పంపాలని ఆయన సవాల్ చేశారు. ‘‘ఇక్కడున్నది కేసీఆర్ కాదు రేవంత్’’ అని ఘాటుగా హెచ్చరించారు.  ‘‘కేసీఆర్ కు సిగ్గున్నా నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాలకులతో వచ్చి ఆక్రమించుకుంటుంటే.. ఈ సన్నాసి నోట్లెకెల్లి మాట ఎల్లలే.. నువ్వు రండగానివి కాబట్టే జగన్ వచ్చి ప్రాజెక్టులు ఆక్రమించుకున్నడు” అని  కేసీఆర్​పై నిప్పులు చెరిగారు. రోజుకు 8 టీఎంసీలను ఏపీ దోచుకుపోతుంటే కేసీఆర్ 2 టీఎంసీల ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేశారని అన్నారు. ‘‘కేసీఆర్ పదేండ్ల కాలంలో ఇరిగేషన్ రంగానికి చేసిన అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం పెట్టి తేటతెల్లం చేస్తం” అని చెప్పారు. 

డ్రామాలు చేయకుండా అసెంబ్లీకి రా

‘‘కేసీఆర్ నల్గొండకు పోవుడు కాదు.. కృష్ణా జలాల్లో ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రా’’ అని సీఎం రేవంత్ సవాల్ చేశారు. కృష్ణా జలాలతో పాటు ప్రాజెక్టులపై అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్ 48 గంటలు ఆపైనా పెట్టేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని అన్నారు. ‘‘ప్రాజెక్టుల హ్యాండోవర్ మీద 48 గంటలు.. నువ్వు కోరుకుంటే అంతకన్నా ఎక్కువ కావాలన్న చర్చిద్దాం.. భోజనాలు అక్కడే పెడుతం.. బట్టలు తెచ్చుకో.. మామాఅల్లుడు  మీరు ఇద్దరు రండి.. అవసరమైతే కొడుకును కూడా తెచ్చుకోండి.. అవతల మీ బిడ్డ ఉంటే శాసన మండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాల్లో  చర్చ పెడుదాం. కేసీఆర్.. నీకు నిజాయితీ ఉంటే ముఖం చాటేయకు. చర్చకు రా..అసెంబ్లీలో చర్చ జరిగినంత సేపు నువ్వు కూర్చోవాలే.. నువ్వు ఎంత సేపు మాట్లాడినా అనుమతి ఇస్తం. వ్యవహారమంతా మీ మామాఅల్లుళ్ల మధ్యనే జరిగింది. ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. ప్రతి డాక్యుమెంట్ పట్టుకుని మేం మాట్లాడుతం.. ఎవడు ద్రోహి.. ఎవడు దొంగ.. ఎవడు లొంగిండు.. ఎవడు వంగిండు.. ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు.. ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది తేలుద్దాం’’ అని సవాల్​ చేశారు. ‘‘కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్, కవిత కలిసి వచ్చి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతామన్న అసెంబ్లీలో టైం ఇస్తం. ప్రభుత్వం తరపున నేను, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతం” అని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పకుండా రావాలన్నారు. ‘‘కాలునొప్పి, కంటి నొప్పి అని కేసీఆర్ డ్రామాలు చేయొద్దు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అధికారం పోయాక ఎక్కడ నొప్పి పుడుతుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాసిండు.  దాన్ని తిరగరాసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేస్తున్నది” అని ఆయన తెలిపారు.

మామా అల్లుళ్లు కలిసి చేసిన్రు

మామా అల్లుళ్లు (కేసీఆర్, హరీశ్ రావు) కలిసే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేశారని సీఎం తెలిపారు. ‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకు కృష్ణా నీళ్లను దోచుకెళ్లేందుకు కేసీఆర్​ సహకరించిండు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ భాగస్వామి. వైఎస్ రాజశేఖర్​రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్  పొక్క పెద్దది చేసినప్పుడు హరీశ్​రావు, నాయిని నర్సింహారెడ్డి రాష్ట్రంలో, కేసీఆర్ కేంద్రంలో మంత్రులుగా ఉన్నరు.. వైఎస్ నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్​లోనే ఉన్న పీజేఆర్, మర్రి శశిధర్​రెడ్డి కొట్లాడితే కేసీఆర్, హరీశ్ రావు మాత్రం పదవులకు ఆశపడి పెదవులు మూసుకున్నరు. అప్పుడు వైఎస్ కు లొంగిపోయిందే కేసీఆర్. 2020 జనవరి 14న జగన్ తో కలిసి కేసీఆర్ కృష్ణా జలాలపై 6 గంటలు సమీక్ష చేసిండు. అప్పుడే రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయే రాయలసీమ లిఫ్ట్ కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. అదే ఏడాది మే 5 రాయలసీమ లిఫ్ట్ కు జీవో వచ్చింది. తండ్రి వైఎస్ పోతిరెడ్డిపాడుతో రోజుకు 4 టీఎంసీలు తరలించుకుపోతే.. కొడుకు జగన్ రాయలసీమ లిఫ్టుతో రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోతున్నడు.. ఆ ప్రాజెక్టును టెండర్ల దశలోనే ఆపే అవకాశమున్నా మేఘా కృష్ణారెడ్డికి సాయం చేయాలనే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కూడా వెళ్లకుండా వాయిదా వేయించిండు. తెలంగాణ నీటిని రాయలసీమకు తరలించుకుపోయేందుకు ధనదాహంతో కేసీఆర్ సహకరించిండు” అని ఆయన మండిపడ్డారు. జల దోపిడీకి కారణం కేసీఆరేనని అన్నారు. చంద్రబాబు హయాంలో శ్రీశైలంలో 800 అడుగుల నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతలు చేపట్టేందుకు కేసీఆర్ సహకరించారని తెలిపారు. పదవులు, కమీషన్లకు లొంగిపోయి జలదోపిడీకి సహకరించారని అన్నారు. 

అడ్డుకోవాల్సింది పోయి ఓటు వేసిన్రు

విభజన చట్టంలోనే తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని ప్రతిపాదిస్తే నాడు ఎంపీగా ఉన్న కేసీఆర్, కేశవరావు అడ్డుకోవాల్సింది పోయి చట్టాన్ని ఆమోదించేలా ఓటు వేశారని సీఎం రేవంత్​ అన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68 శాతం ఉంటే ఏపీలో 32 శాతమే ఉందని, కానీ కృష్ణా నీళ్లలో ఎక్కువ వాటా ఏపీకి దక్కేలా కేసీఆర్ సహకరించారని మండిపడ్డారు. నీటి పంపకాల్లో అంతర్జాతీయ విధివిధానాల ప్రకారం చూసుకున్నా తెలంగాణకు 500 టీఎంసీలకు పైగా దక్కాలని, కనీసం ఆ డిమాండ్ కూడా చేయకుండా సంతకాలు పెట్టి మరీ తెలంగాణకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అన్నారు. 2022లో నిర్వహించిన కేఆర్ఎంబీ మీటింగ్ లోనే కృష్ణాలో 15 కంపోనెంట్లను బోర్డుకు అప్పగిస్తామని అంగీకరించారని తెలిపారు. 2023 మే 19న నిర్వహించిన కేఆర్ఎంబీ 17వ  మీటింగ్ లో ఆయా కంపోనెంట్లను కేంద్రానికి అప్పగిస్తున్నట్టు కేసీఆర్ ఒప్పుకున్నారని ఆయన అన్నారు. 

కేంద్రం ముందు వాదనలు వినిపిస్తం

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని, ఇప్పటి నుంచి ప్రతి సమావేశానికి వెళ్లి తమ వాదనలు వినిపిస్తామని రేవంత్​  స్పష్టం చేశారు. తెలంగాణ లంకె బిందెలాగా ఉండేది.. కానీ కల్వకుంట్ల కుంటుంబం దోచుకొని మట్టి బిందెగా మార్చిందని మండిపడ్డారు. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని గజదొంగలంటారు అని ఆయన అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలపై స్పష్టత ఇచ్చే వరకు ప్రాజెక్టులు అప్పగించేది లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి తేల్చిచెప్పామని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో కృష్ణా ప్రవాహం మొదలయ్యే చోటు నుంచి నది పారే వరకు ప్రాజెక్టుల వాటాలు తేల్చాలని కోరామన్నారు.  

కేసీఆర్.. నువ్వు నల్గొండకు పోవుడు కాదు, కృష్ణా జలాల్లో ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రా. భోజనాలు అక్కడే పెడ్తాం.. బట్టలు తెచ్చుకో.. మామాఅల్లుడు  మీరు ఇద్దరు రండి.. అవసరమైతే మీ కొడుకును కూడా తెచ్చుకో. అవతల మీ బిడ్డ ఉంటే శాసనమండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాల్లో చర్చ పెడ్దాం. నువ్వు ఎంత సేపు మాట్లాడినా అనుమతి ఇస్తం. ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం. ప్రతి డాక్యుమెంట్ పట్టుకొని మేం మాట్లాడుతం. ఎవడు ద్రోహి.. ఎవడు దొంగ.. ఎవడు లొంగిండు.. ఎవడు వంగిండు.. ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండో తేలుద్దాం. కాలునొప్పి, కంటి నొప్పి అని డ్రామాలు చేయొద్దు. నీకు నిజాయితీ ఉంటే ముఖం చాటేయొద్దు. అసెంబ్లీకి రా. 
- సీఎం రేవంత్​రెడ్డి