
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్బంగా అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం రేవంత్. కేసీఆర్ కు నిజాం కంటే శ్రీమంతుడు కావాలనే కోరిక ఉందని..అందుకే మామా అల్లుళ్లు కాళేశ్వరం రూపంలో లక్ష కోట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్ వేశారని మండిపడ్డారు. నిపుణులు వద్దన్నా ప్రాణహిత చేవెళ్ల లొకేషన్ మార్చి.. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టారని.. వీళ్లు చేసిన తప్పుకు ఉరి తీయాలని ధ్వజమెత్తారు రేవంత్. కమిషన్ రిపోర్ట్ అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్.
నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ కడితే ఖర్చు వృథా అవుతుందని కేంద్రం చెప్పిందన్నారు రేవంత్. పొగత్రాగడం హానికరం అని రాసినట్టే..ప్రాజెక్టు గురించి కేంద్రం హెచ్చరించిందన్నారు. కేసీఆర్ కు ధనాశ,దురాశ కల్గిందేమో అందుకే మేడిగడ్డ దగ్గరే ప్రాజెక్ట్ కట్టాలని అప్పటికే కేసీఆర్,హరీశ్ నిర్ణయం తీసుకున్నారని రేవంత్ చెప్పారు. తెలంగాణ ప్రజల లక్ష కోట్లు దోచుకునేందుకే ఇలా చేశారని.. మిమ్మల్ని శిక్షించాలని పీసీ ఘోష్ కమిషన్ చెప్తోందన్నారు.
కమీషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ప్రాంతాన్ని మార్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాణహితలో నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2009లోనే సీడబ్ల్యూసీ లేఖ ఇచ్చిందని చెప్పారు రేవంత్. ప్రాణహిత ప్రాజెక్ట్ కట్టుకోవచ్చని 2009లోనే కేంద్రం చెప్పిందన్నారు. సభను,ప్రజలను హరీశ్ తప్పుదారి పట్టిస్తున్నారని పైర్ అయ్యారు రేవంత్. హరీశ్ రావు తప్పు చేశారని పీసీ ఘోష్ కమిషన్ చెబుతోందని.. వాళ్ల తప్పులను బయటపెట్టారు కాబట్టే నివేదికను బీఆర్ఎస్ తప్పుబడుతోందన్నారు.
నిజాయితీ పరులైతే ఏ విచారణ కావాలో మేరే చెప్పాలని హరీశ్ కు రేవంత్ సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని దోపిడి చేసి మళ్లీ మళ్లీ హరీశ్ అబద్దాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్టుకు అప్పటి మహారాష్ట్ర అడ్డు చెప్పలేదన్నారు రేవంత్. 148 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టుకొమ్మని మహారాష్ట్ర చెప్పిందన్నారు రేవంత్.