
- ఏ స్కీమ్‌లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దు
- గత సర్కారు నిర్వాకంతో సమస్యల తిష్ట
- ఒక్కోటి పరిష్కరిద్దాం.. మంత్రులతో సీఎం రేవంత్
- పదేండ్లలో ఇండ్లు ఇవ్వకనే ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్
- హైదరాబాద్‌లోని అర్హులకు వాళ్ల పరిసరాల్లోనే కేటాయిద్దాం
- గత ప్రభుత్వం మూడు డీఏలు పెండింగ్‌లో పెట్టింది
- భూ సమస్యల అప్లికేషన్లు త్వరగా క్లియర్ చేయాలని ఆదేశం
- ఈ నెల 5న కేబినెట్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని, ప్రతి దానికి చిక్కుముళ్లు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ధరణి తీసుకువచ్చి భూ సమస్యలను పెంచారని, వాటిన్నింటినీ చక్కదిద్దేందుకే భూ భారతి తెచ్చామని, యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు. పదేండ్లలో ఆశించిన స్థాయిలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించకపోవడంతోనే ఇండ్లు లేని పేదల సంఖ్య పెరిగిందని.. అందుకే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్ ఏర్పడిందన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా గత సర్కార్ పెండింగ్‌లో పెట్టిందని.. మూడు డీఏలను చెల్లించలేదని తెలిపారు. ఏ ఒక్క స్కీమ్‌లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దని.. టైమ్‌కు అన్నీ అందేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్‌సమావేశం నిర్వహిద్దామన్నారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆదివారం రెండు గంటలపాటు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానా కాలం పంటల సాగు సన్నద్ధత, రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికలపై చర్చించారు. మే 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అవతరణ దినోత్సవ ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తుది జాబితాలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలపై సమావేశంలో వివరించారు. ఇందిరమ్మ ఇండ్లతో పాటు రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక, భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అప్లికేషన్లు, ధాన్యం కొనుగోళ్లు, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం సజావుగానే కొనసాగుతున్నప్పటికీ.. నిధుల కొరత రాకుండా పెట్టుకున్న 4.50 లక్షల ఇండ్ల టార్గెట్ ను పూర్తి చేయడం, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మరో నాలుగున్నర లక్షల ఇండ్లను ఇవ్వాల్సి ఉంది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇండ్లకు ఇంకా నిధులు అందకపోవడం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. గత ప్రభుత్వం పదేండ్లలో ఆశించిన స్థాయిలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించకపోవడంతోనే ఇండ్లు లేని పేదల సంఖ్య పెరిగిందని.. అందులో భాగంగానే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్ ఏర్పడినట్లు సీఎం పేర్కొన్నారు. నిర్మించిన కొన్ని ఇండ్లను కూడా సరిగ్గా కేటాయింపులు చేయలేదని.. రోజూ పనిచేసుకునేవాళ్లకు, చిన్న స్ట్రీట్ బిజినెస్ చేసుకునేటోళ్లకు ఎక్కడో శివారులో ఇండ్లు ఇవ్వడంతో వాటిని తీసుకోలేదు. దీంతో ఈసారి హైదరాబాద్ ప్రాంతంలోని అర్హులకు వారు ఉండే పరిసరాల్లోనే కొత్తగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి కేబినెట్ సమావేశానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసినట్లు సమాచారం.
రెవెన్యూ సదస్సుల అప్లికేషన్లపై నిర్లక్ష్యం వద్దు
ఇప్పటికే పూర్తయిన, జూన్ మూడో తేదీ నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులపైనా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించారు. భూ భారతి ఫీడ్ బ్యాక్ ఎలా ఉందనేది మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలం కింద నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లు, వాటి పరిష్కారం ఎలా జరుగుతుందనే దానిపై ఆరా తీశారు. మొత్తం 32 మండలాల్లో దాదాపు 60 వేల అప్లికేషన్లు వచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. అయితే క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ఎమ్మార్వోలు అప్లికేషన్లను పరిష్కరించడం లేదని.. దరఖాస్తులను ఎక్కువ సంఖ్యలో రిజెక్ట్ చేస్తున్నారని సమావేశంలో మంత్రులు పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లలో పరిష్కారమైనవాటి కంటే రెజెక్ట్ అయినవే ఎక్కువగా ఉండటంతో మరోసారి వాటిని వెరిఫై చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. గత ప్రభుత్వ ధరణి తీసుకువచ్చి భూ సమస్యలను పెంచిందని.. వాటిన్నింటిని చక్కదిద్దేందుకే భూ భారతి తెచ్చినందున యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో రెవెన్యూ యంత్రాంగం సీరియస్‌గా పనిచేసేలా యాక్షన్ ప్లాన్ ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
ఉద్యోగుల బకాయి నిధులు ప్రతి నెలా కొంత ఇద్దాం
ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఇప్పటికే కమిటీ తన నివేదికను అందించింది. ఆ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు సమావేశంలో భట్టి విక్రమార్క వివరించారు. దీనిపై కేబినెట్లో చర్చించి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను ప్రతినెలా కొంత మొత్తం చెల్లించేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గత ప్రభుత్వం మూడు డీఏలను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిందని, దానివల్ల ఇప్పుడు ఒకేసారి చెల్లింపులకు ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, సర్వీసుల్లో ఉన్నోళ్ల జీపీఎఫ్ ఇతర బిల్లులను క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని.. మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఇప్పటికే ఇచ్చిన నివేదికలో ఈ అంశాలు ఉన్నందున మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది.
పెట్టుబడి సాయంపై త్వరలో నిర్ణయం
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాల సమస్య రాకుండా చూసుకోవాలని, బ్యాంకులు క్రాప్ లోన్లు కూడా త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగంతో మంత్రులు సమీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. వానాకాలం సీజన్ ముందే రావడంతో రైతు భరోసాపై మంత్రులు సీఎం రేవంత్ దగ్గర ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో పెండింగ్‌లో ఉన్న యాసంగి పెట్టుబడి సాయం, ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయంపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రులకు సీఎం చెప్పారు.