ఇక పాలనపైనే ఫోకస్..ఇయ్యాల్టి నుంచే పని మొదలుపెడ్తం : సీఎం రేవంత్ రెడ్డి

ఇక పాలనపైనే ఫోకస్..ఇయ్యాల్టి నుంచే పని మొదలుపెడ్తం : సీఎం రేవంత్ రెడ్డి
  • అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనే నా ఎజెండా
  • రుణమాఫీ, వడ్ల కొనుగోలు, విద్యారంగానికి ఫస్ట్​ ప్రయారిటీ
  • కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేస్తం.. తడిసిన వడ్లన్నీ కొంటం 
  • కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రానికి నాలుగు మంత్రి పదవులు
  • జిల్లాల పునర్విభజనపై ఆలోచిస్తున్నం
  • అంతకంటే ముందు మండలాలు, రెవెన్యూ డివిజన్ల రేషనలైజేషన్
  • మీడియాతో చిట్​చాట్​లో ముఖ్యమంత్రి వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : ఎన్నికలు ముగిశాయని, ఇక తమ ఫోకస్​ అంతా పాలనపైనే ఉంటుందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. బుధవారం నుంచే పని మొదలుపెడతామని చెప్పారు. రుణమాఫీ, వడ్ల కొనుగోలు, విద్యారంగం తమ మొదటి ప్రాధాన్య అంశాలని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో మీడియాతో రేవంత్ చిట్​చాట్ చేశారు. ఈ సందర్భంగా లోక్​సభ ఎన్నికలు, పాలన, ఇతర అంశాలపై ఆయన మాట్లాడారు. ‘‘రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, ఎత్తులు, ఎత్తుగడలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాను.

సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతాను. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి, వాటిని పరిష్కరించే లక్ష్యంతో పని చేస్తాను’’ అని తెలిపారు.  ‘‘వంద రోజుల పాలన ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ప్రజల కోసం ఎంతో చేయగలిగాం. ఎన్నికల కారణంగా కొంత గ్యాప్​ వచ్చింది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించుకున్నాం” అని చెప్పారు. 

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రేవంత్ తెలిపారు. “అకాల వర్షాలకు పంట తడిసి రైతులు నష్టపోయారు. వాళ్ల పంటను మద్దతు​ధరకు కొంటామని చెప్పినం. చెప్పినట్లుగానే రైతులకు నష్టం లేకుండా చూస్తాం. తర్వాత రుణమాఫీ మీద ఫోకస్​పెడతాం. నేను ముందే చెప్పినట్టుగా పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతాం. ఫార్మర్ ​వెల్ఫేర్​ అండ్​ డెవలప్​మెంట్​కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాన్ని సర్దేస్తాం’’ అని చెప్పారు. రుణమాఫీ సాధ్యం కాదని కొందరు ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని, కానీ రైతు భరోసా అందజేసినట్టే దీన్ని కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

‘‘త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. స్కూలు ఫీజులు, పుస్తకాలు, బడులకు సౌకర్యాల కల్పన వంటి అంశాలపై దృష్టి సారిస్తాం. మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం అందేలా చూస్తాం. ఇన్ని రోజులు మేం, మా అధికారులు ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నాం. ఇక అది ఒడిసిన ముచ్చట. ఇప్పుడు ఏ విమర్శలను పట్టించుకోకుండా పీపుల్స్​ఎజెండాతో ముందుకు సాగుతాం’’ అని వెల్లడించారు. ఫోన్​ట్యాపింగ్​, ఈ–రేసింగ్​ లాంటి అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. 

ఫార్మా విలేజీలతో నష్టం లేదు

రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్​పెట్టి, తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామిగా తయారు చేసేందుకు అన్ని రకాలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రేవంత్ తెలిపారు. వైబ్రెంట్ తెలంగాణపై త్వరలో డిస్కషన్ ఉంటుందని చెప్పారు. అధికారులు అదే పనుల్లో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. ‘‘ఔటర్​రింగ్​రోడ్డు నుంచి ట్రిపుల్​ఆర్​ వరకు ఉన్న ప్రాంతాల ముఖచిత్రమే మార్చివేస్తాం. రేడియల్​రోడ్ల ద్వారా కనెక్టివిటీ పెంచుతాం. ఫార్మాతోపాటు హెల్త్​, టూరిజం, స్పోర్ట్స్​ క్లస్టర్లు వస్తాయి. ఫార్మా విలేజీలతో కాలుష్యం విస్తరిస్తుందని కొందరు అంటున్నారు.

ఒకే ప్రాంతంలో ఎక్కువ కంపెనీలు నిర్మిస్తే సమస్య వస్తుంది. కానీ దూరందూరంగా కంపెనీలు విభజించి చిన్న చిన్న విలేజీలుగా మార్చి, ఈ విలేజీలు కూడా ఊర్లకు దూరంగా ఉండేలా ప్లాన్​ చేస్తే ఏ సమస్యా రాదు. ట్రీట్​మెంట్​ప్లాంట్లు ఏర్పాటు చేసి కాలుష్యాన్ని నియంత్రించడం ఇంకింత సులభమవుతుంది’’ అని తెలిపారు. 

త్వరలో మూసీ ప్రక్షాళన 

అందరూ మూసీ ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, కానీ ఇది భవిష్యత్తులో పెద్ద ఆదాయ వనరుగా మారుతుందని రేవంత్ తెలిపారు. ‘‘మూసీ మీద పెట్టే ప్రతీ పైసా వెనక్కి తిరిగి వస్తుంది. మేం రూపొందించే మోడల్​ ఆ విధంగా ఉంటుంది. త్వరలో దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయి” అని వెల్లడించారు. హైదరాబాద్​యూటీగా మారుతుందన్న ప్రతిపక్షాల కామెంట్లపై స్పందిస్తూ..  ‘‘అవి తెలివి తక్కువోడు మాట్లాడే మాటలు.

కేవలం ఒక స్టాప్​ గ్యాప్​ కింద మాత్రమే ఒక ప్రాంతాన్ని తాత్కాలికంగా యూటీగా ఉంచుతారు. తర్వాత దాన్ని రాష్ట్రంగా మార్చాల్సిందే. బీజేపీ సర్కార్​ లడఖ్​ను యూటీగా మార్చినందుకే అక్కడి జనం తిడుతున్రు. రాష్ట్రంగా మార్చాలని అడుగుతున్నరు. అలాంటప్పుడు ఏ సమస్యా లేని హైదరాబాద్​ను యూటీగా ఎలా మారుస్తారు” అని అన్నారు.  

హైదరాబాద్ లెక్క వరంగల్ అభివృద్ధి

హైదరాబాద్​కు సమాంతరంగా వరంగల్​ను డెవలప్​ చేస్తామని రేవంత్ తెలిపారు. ‘‘వరంగల్​కు ఎయిర్​పోర్టు, ఔటర్​రింగ్​రోడ్డు, ఐటీ కంపెనీలను ఇస్తామని ఇప్పటికే చెప్పినం. దానికి కట్టుబడి ఉన్నం. మౌలిక సదుపాయాలు కల్పిస్తే, ఆ ప్రాంతం ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను కూడా ఇదే తరహాలో డెవలప్​ చేస్తాం” అని చెప్పారు. జిల్లాల పునర్విభజనపై ఆలోచన చేస్తున్నామన్నారు.

‘‘అయితే అంతకంటే ముందు మండలాలు, రెవెన్యూ డివిజన్లను రేషనలైజేషన్​ చేయాలి. ఆ పని చేయకుండా జిల్లాల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది వృథా అవుతుంది. మండలాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా రేషనలైజేషన్ జరగలేదు. కేసీఆర్ అడ్డగోలుగా, అనాలోచితంగా జిల్లాలను ఏర్పాటు చేశారు. జిల్లాల మీద కేసీఆర్ ఇప్పుడేం చెప్పినా జనం నమ్మరు. ఆయన ఇక ఇంటికాడ కూర్చుంటేనే కొంచెం గౌరవమైనా దక్కుతుంది’’అని అన్నారు. 

అసెంబ్లీలో చర్చ తర్వాతే రైతు భరోసాపై నిర్ణయం

అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండేలా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ తెలిపారు. ‘‘సమస్యల పరిష్కారం కోసం రైతు, రైతు కూలీ సంఘాలతో మీటింగ్​లు నిర్వహిస్తాం. పంట పెట్టుబడి, గిట్టుబాటు ధరలపై ఎప్పటికప్పుడు చర్చిస్తాం. ధరణి కమిటీ రిపోర్టు అందజేయగానే భూసమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తాం. అసెంబ్లీలో అన్ని విషయాలు చర్చించి, అవసరమైతే కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తాం. రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చూస్తాం. ఉత్పత్తిదారులైన రైతులకు, వినియోగదారులైన సామాన్య ప్రజలకు మధ్య ప్రభుత్వం వారధిగా ఉండి

 ఇద్దరికీ ప్రయోజనం కలిగించేలా ప్రణాళిక రూపొందిస్తాం. రైతుల నుంచి పంట ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, వాటిని ప్రాసెస్​చేసి రేషన్​ షాపుల ద్వారా తక్కువ ధరకు ప్రజలకు విక్రయిస్తాం. గతంలో రేషన్​ షాపుల ద్వారా తొమ్మిది రకాల వస్తువులు ఇచ్చేవాళ్లు. కానీ కేసీఆర్ దాన్ని కేవలం బియ్యానికే పరిమితం చేశారు. ఆ బియ్యం కూడా సరైనవి ఇవ్వడం లేదు. మేం మాత్రం సన్నబియ్యం అందేలా చూస్తాం. రేషన్​షాపులో సన్న బియ్యం దొరికితే జనం ఎందుకు కొనరు.. తప్పకుండా కొంటారు. రైతుల నుంచి సన్న వడ్లు కొంటాం. రూ.500 బోనస్​ ప్రకటిస్తే రైతులు అవే వడ్లు పండిస్తారు. ఇన్ని రోజులు ఆ భరోసా లేకనే రైతులు నష్టాలకు భయపడి దొడ్డు బియ్యం పండిస్తున్నారు.

తాలు తప్ప అంటూ తరుగు తీయకుండా వడ్లు కొంటున్నాం. గతంలో బీఆర్ఎస్ హయాంలో క్వింటాలుకు 10 కిలోల తాలు తీసి రైతులను దోచుకున్నారు. మిల్లర్ల నుంచి ఇప్పటికే చాలా వరకు ధాన్యాన్ని రికవరీ చేశాం. ఇంకా ఎవరైనా సర్కారు సొమ్మును మింగుకుంటా కూర్చుంటే తొక్కి తోలు తీస్తాం” అని హెచ్చరించారు. రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి? అనే దానిపై అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాతే నిర్ణయిస్తామని వెల్లడించారు.  

త్వరలో విద్యా కమిషన్.. ​

విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యా కమిషన్​ ఏర్పాటు చేస్తామని రేవంత్ వెల్లడించారు. ‘‘విద్యార్థులకు ఎలాంటి సిలబస్​ ఉండాలనే దానిపై ఇది సూచనలు చేస్తుంది. ఫీజుల నియంత్రణపై ఫోకస్ ​పెడతాం. అన్ని వర్సిటీలకు త్వరలో కొత్త వీసీలను నియమిస్తాం. పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా రంగం లో ఉండే అన్ని రకాల సమస్యలను పరిష్క రిస్తాం” అని తెలిపారు. గత ప్రభుత్వంలోని అధికారులు కొందరు ఇంకా కంటిన్యూ అవుతున్నారనే ప్రశ్నకు జవాబిస్తూ.. ‘‘పాలనాపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే నాకు పరిమితులు ఉంటాయి.

అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేయడం కుదరదు. ప్రతి దానికి సమయం, సందర్భం చూసుకోవాలి. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం. నాకు ఒకరు నచ్చలేదనో, కోపం ఉందనో ఉద్యోగులను మార్చేయలేం కదా?” అని అన్నారు. వెయ్యిమందికి పైగా ఉన్న రిటైర్డ్​ఉద్యోగులను తొలగించే విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

13 సీట్లలో గెలుస్తం.. 

రాష్ట్రంలో 13 ఎంపీ సీట్లను గెలుచుకుంటామని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నాలుగు మంత్రి పదవులు దక్కుతాయని చెప్పారు. బీఆర్ఎస్​కు ఆరేడు సీట్లలో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కేంద్రంలో బీజేపీకి 210కి 10 అటూఇటుగా సీట్లు వస్తాయని అన్నారు. ‘‘ఏపీ రిజల్ట్స్​పై నాకు అవగాహన లేదు. అక్కడ ఎవరు గెలిచినా మేం సత్సంబంధాలనే కలిగి ఉంటాం. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకొని ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తాం. పాజిటివ్​గానే మా థింకింగ్​ ఉంటుంది’’ అని సీఎం తెలిపారు. జూన్​4 తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ‘‘మా సర్కార్ కూలాలంటే బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటి కావాలి.

ఆ రెండు పార్టీలు ఒక్కటైతే, అది నచ్చని ఆ పార్టీల ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది? మా సర్కార్​ కాదు.. వాళ్ల పార్టీలే కూలుతయ్​. బీఆర్ఎస్ ​ఆనవాళ్లు లేకుండా పోతుంది’’ అని అన్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్న ప్రశ్నకు జవాబు చెప్తూ.. ‘‘ఎన్నికల కోడ్ ముగియాలి. అప్పుడే హైకమాండ్​ దానిపై దృష్టి పెడుతుంది” అని చెప్పారు.