కేసీఆర్ తెచ్చిన చట్టాలే గుదిబండలైనయ్: సీఎం రేవంత్

కేసీఆర్ తెచ్చిన చట్టాలే గుదిబండలైనయ్: సీఎం రేవంత్
  • 50 శాతానికే రిజర్వేషన్లు పరిమితం చేసిన్రు: సీఎం రేవంత్​ 
  • బీఆర్ఎస్​ నేతలు చేసిన పాపాలను మేం కడుగుతున్నం
  • బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్లకు ఇష్టం లేదు
  • ఢిల్లీలో ధర్నా చేస్తే అటువైపు కూడా రాలేదని కామెంట్


హైదరాబాద్, వెలుగు: విద్య, ఉద్యోగాలు, స్థానిక  సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు 2018, 2019లో కేసీఆర్ తెచ్చిన చట్టాలే గుదిబండలుగా మారాయని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. 2018లో తెచ్చిన పంచాయతీరాజ్​చట్టం, 2019లో తీసుకొచ్చిన మున్సిపల్ ​చట్టంలో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేశారని పేర్కొన్నారు. అందుకే ఆర్డినెన్స్​ తేవాల్సి వచ్చిందని, దాన్ని కూడా గవర్నర్​ బిల్లులను పంపినట్టే రాష్ట్రపతికి పంపించారన్నారు. నాడు బీఆర్ఎస్​నేతలు చేసిన పాపాలను ఇప్పుడు తాము కడుగుతున్నామని చెప్పారు.

 ఆదివారం అసెంబ్లీలో మున్సిపల్​చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆరునూరైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేశారు. ‘‘బీసీ రిజర్వేషన్ల బిల్లులపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాం. ఐదుసార్లు ప్రధాని అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్​అడిగినా ఇవ్వలేదు. అందుకే ఢిల్లీలోని జంతర్​మంతర్ వద్ద ధర్నా చేస్తే ఇతర పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు మాకు మద్దతు ఇచ్చారు. కానీ బీఆర్ఎస్​రాజ్యసభ సభ్యులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్​నేతలకు ఇష్టం లేదు” అని మండిపడ్డారు. కేసీఆర్​సభకు వచ్చి బిల్లులపై ఒక్క మంచి మాట చెప్పి ఉంటే ఆయన పెద్దరికం నిలబడేదని అన్నారు.  

గంగుల.. ఏదైనా ఉంటే నాకు చెప్పండి.. 

తాను మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ​కామెంట్స్​ చేయడంతో ఆయనకు సీఎం రేవంత్​ కౌంటర్​ ఇచ్చారు. ‘‘ఆయన (సంజయ్) కూడా ఆ బాపతే. అది కల్వకుంట్ల కుటుంబం కాదు.. కల్వకుంట కుటుంబం. ఎవరినీ కలవనీయదు” అని సీఎం మండిపడ్డారు. చిత్తశుద్ధితో ఈ బిల్లులను ఆమోదించుకుందామని సభ్యులను కోరారు. ‘‘పొన్నంను గంగుల అవమానించినా.. గంగులను పొన్నం అవమానించినా బీసీలకే నష్టం. బీసీ బిల్లులు పాసై రిజర్వేషన్లు వస్తే తాను సంతోషంగా ఉంటానని గంగుల అన్నారు. కానీ వాళ్ల బాస్, చిన్న బాస్, హరీశ్​రావు మాత్రం సంతోషంగా ఉంటారని చెప్పలేదు. వాళ్లు కడుపు నిండా విషం పెట్టుకుని ఉన్నారంటూ చెప్పకనే చెప్పారు. వాళ్లు చేసిన తప్పులకు ప్రజలు ఇప్పటికే శిక్ష వేశారు. అయినా మారకపోతే ప్రజలు ఆ హోదా (ప్రతిపక్షం) కూడా ఇవ్వరు. గంగుల కమలాకర్ ​వాళ్ల పరిధిలో ఉండి మాట్లాడుతున్నారు. ఆయనకు ఏవైనా సమస్యలుంటే నాకు చెబితే మంచీచెడ్డలు చూసుకుంటాను. మీకు నేను ఉన్నా.. ఏదైనా ఉంటే నాకు చెప్పండి” అని అన్నారు.  

శాస్త్రీయంగా కులగణన.. 

కులగణనను శాస్త్రీయంగా నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘బీసీల వివరాలను సేకరించే బాధ్యతను మొదట బీసీ కమిషన్‌‌‌‌‌‌‌‌కు అప్పగించాం. అయితే రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య బీసీ డెడికేటెడ్​కమిషన్​ ద్వారా సమాచార సేకరణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్​ వేశారు. డెడికేటెడ్​కమిషన్​ వేయాలని హైకోర్టు చెప్పడంతో.. 24 గంటల్లోనే కమిషన్​ ఏర్పాటు చేశాం. బిహార్, రాజస్తాన్ ​వంటి రాష్ట్రాల్లో వచ్చిన అడ్డంకులు ఇక్కడ రాకుండా ఉండేందుకు.. అధికారులు, మంత్రులను పంపించి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయించాం. న్యాయపరంగా ఎదురైన సమస్యలను పరిశీలించాకే డెడికేటెడ్​ కమిషన్ నియమించాం. బీసీ రిజర్వేషన్ల బిల్లులను పాస్ ​చేసి గవర్నర్ ​ఆమోదం కోసం పంపితే.. ఆయన రాష్ట్రపతి వద్దకు పంపారు. 5 నెలల నుంచి ఆ రెండు బిల్లులూ రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఈలోగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. సెప్టెంబర్​ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. దాని కోసమే పంచాయతీరాజ్, మున్సిపల్​చట్టాలకు సవరణలు చేసే బిల్లులను తీసుకొచ్చాం” అని వివరించారు.

మున్సిపాలిటీ సిబ్బందికి జీతాల్లేవ్: పాల్వాయి హరీశ్​

మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వని దుస్థితిలో కాంగ్రెస్  ప్రభుత్వం ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​ అన్నారు. ప్రభుత్వం ఎస్​డీఎఫ్​ నిధులు మంజూరు చేయాలని కోరారు. పంచాయతీల్లో ఉపాధి నిధులతో సీసీ రోడ్ల పనులు చేపడుతున్నారని తెలిపారు.  

ట్రాక్టర్లలో డీజిల్​ పోయలేని పరిస్థితి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి

గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక సెంట్రల్​ ఫండ్స్​ రావడం లేదని, దీంతో పంచాయతీల పరిస్థితి అధ్వానంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని, వెంటనే స్టేట్​ ఫైనాన్స్​ నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ట్రాక్టర్లలో డీజిల్​ కూడా పోయలేని పరిస్థితి ఉందన్నారు. సెక్రటరీలు సొంతంగా డబ్బులు పెట్టుకుంటున్నారన్నారు. 

రోడ్లు డ్యామేజ్​ అయ్యాయి: కొత్త ప్రభాకర్​రెడ్డి

వర్షాలకు గ్రామీణ, మున్సిపాలిటీ, ఆర్​అండ్​ బీ రోడ్లు డ్యామేజ్​ అయ్యాయని, మండలాలు, జిల్లా కేంద్రాలకు కనెక్టివిటీ దెబ్బతిన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి పేర్కొన్నారు. ఎలక్ట్రికల్​ పోల్స్ కూలిపోయాయని, వీటి రిపేర్ల కోసం నిధులు కేటాయించాలని కోరారు.