వక్ఫ్ ఆస్తులు కాపాడి అభివృద్ధి చేస్తాం సమస్యలన్నీ పరిష్కరిస్తాం: రేవంత్

వక్ఫ్ ఆస్తులు కాపాడి అభివృద్ధి చేస్తాం సమస్యలన్నీ పరిష్కరిస్తాం: రేవంత్
  • వక్ఫ్ బోర్డు ప్రతినిధి బృందానికిసీఎం రేవంత్ హామీ
  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నేతృత్వంలో భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు కాపాడి అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు) షబ్బీర్ అలీ నేతృత్వంలోని వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా ప్రతినిధి బృందంతో రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు సమస్యలను సభ్యులు సీఎంకు వివరించారు. తర్వాత షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ‘‘వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అంశాలపై అధ్యయనం, పరిశీలన, విశ్లేషించేందుకు సమగ్ర సమావేశం నిర్వహించాలని వక్ఫ్ బోర్డును సీఎం ఆదేశించారు. అన్ని సమస్యలను లిస్ట్ ఔట్ చేయాలని చెప్పారు. వక్ఫ్ ఆస్తులను కాపాడి, అభివృద్ధి చేయడంపై ఆయన సీరియస్​గానే ఉన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై వీలైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు సీఎం చర్యలు తీసుకుంటామని చెప్పారు’’అని షబ్బీర్ అలీ వివరించారు. 

త్వరలో సెక్రటేరియెట్​లో భేటీకాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సాధికారత కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని, వారికి ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదని సీఎం భరోసా ఇచ్చినట్టు షబ్బీర్ అలీ తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వక్ఫ్ బోర్డుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా విధులు నిర్వహించేందుకు అవసరమైన అధికారాలు, మద్దతు, నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ‘‘ఎంఐఎంతో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ అభివృద్ధి నిధుల కోసం వారి అభ్యర్థనను సీఎం ఆమోదించారు. రూ.125 కోట్ల నిధులు కోరగా.. వివిధ పనులకు రూ.200 కోట్లు మంజూరు చేశారు. 

వక్ఫ్‌‌‌‌‌‌‌‌ ఆస్తుల విషయంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు త్వరలో సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తాను’’అని షబ్బీర్ అలీ వివరించారు. సీఎంను కలిసిన వారిలో  కొత్తగా ఎన్నికైన వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లా, వక్ఫ్ బోర్డు సభ్యులు సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్ సబ్రీ, మాలిక్ మోతాసిం ఖాన్, సయ్యద్ అబుల్ ఫతే బందగీ పాషా ఖాద్రీ, మౌలానా సయ్యద్ నిసార్ హుస్సా ఉన్నారు.