న్యూఢిల్లీ: అజిముత్ ఏఐ, సైయెంట్ సెమీకండక్టర్‌లు కలిసి సోమవారం (నవంబర్ 18) ‘ఆర్కా జీకేటీ1’ అనే భారతదేశపు తొలి అడ్వాన్స్డ్ చిప్‌ను లాంచ్ చేశాయి. ఇది మొదటి జనరేషన్ ఇంటెలిజెంట్ పవర్ (ఐపీ) సిస్టమ్ ఆన్ ఏ చిప్ (ఎస్‌ఓసీ). మల్టీ-కోర్ కంప్యూటింగ్, అనలాగ్ సెన్సింగ్, మెమరీ, ఇంటెలిజెంట్ పవర్ మేనేజ్‌మెంట్ వంటివి ఎస్‌ఓసీ కింద ఇంటిగ్రేట్ చేయగలదు.
ఇది స్మార్ట్ యుటిలిటీస్, అడ్వాన్స్‌డ్ మీటరింగ్, బ్యాటరీ మేనేజ్‌మెంట్, స్మార్ట్ సిటీస్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి రంగాలకు తక్కువ విద్యుత్ వినియోగంతో రియల్-టైమ్ ఇంటెలిజెన్స్ అందిస్తుందని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. ఈ చిప్, స్వదేశీ సాంకేతికతలో కీలక మైలురాయిగా నిలిచిందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
భారత సెమీకండక్టర్ ప్రయాణంలో గొప్ప ముందడుగు పడిందని సైయెంట్ ఎండీ కృష్ణ బోదనపు అన్నారు. “ఇది స్మార్ట్ ఎనర్జీ, బ్యాటరీ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఇంటెలిజెన్స్ వంటి వేగంగా పెరుగుతున్న మార్కెట్లకు తక్కువ పవర్ సిలికాన్‌ను అందిస్తుంది”అని అజిముత్ ఏఐ సీఈఓ ప్రవీణ్ యాసరపు పేర్కొన్నారు.
