- భూ భారతిని సక్రమంగా అమలు చేయండి: సీఎం రేవంత్
- సాదాబైనామాల సమస్య శాశ్వతంగా పరిష్కరించాలి
- తప్పులు కప్పిపుచ్చుకోవడానికే గత పాలకులు వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు
- కాళేశ్వరం కూలినందుకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తరా ?
- తెలంగాణ ప్రజలకు, భూమికి అవినాభావ సంబంధం
- భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారిని తరిమికొట్టారని కామెంట్
- 5,107 మంది జీపీవోలకు నియామక పత్రాలు అందజేత
హైదరాబాద్, వెలుగు: ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో తొలగించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు రెవెన్యూ అధికారుల వల్ల సమస్యలు రాలేదని, ధరణి వల్లే వచ్చాయని అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం జరిగిన కొలువుల పండుగ’ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5,107 మంది గ్రామ పాలన అధికారుల (జీపీవో)కు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భూమితో చెలగాటమాడిన వారెవరూ ఆధిపత్యాన్ని సాధించలేరని, అది అసాధ్యమని పేర్కొన్నారు.
తెలంగాణ చరిత్రలో భూమిని ఆక్రమించుకోవాలనుకున్న వారిని ప్రజలు వీరోచితంగా పోరాడి తరిమికొట్టిన సందర్భాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.‘‘ధరణి ముసుగులో దోపిడీకి పాల్పడాలనుకున్న వారికి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో గుణపాఠం చెప్పా రు. అందుకే ప్రజాపాలన వచ్చింది’’ అని అన్నారు.
ధన, భూదాహంతో ధరణి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ధన, భూదాహంతో గత పాలకులు ధరణి అనే భూతాన్ని సృష్టించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి ద్వారా కొల్లగొట్టిన భూముల లెక్కలు ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతోనే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను బలిపశువులుగా చేసి రద్దు చేశారని అన్నారు. ‘‘విశ్వాసం కలిగిన కుక్కనైనా చంపాలంటే పిచ్చిదని ముద్ర వేయాలని పెద్దలు చెప్పినట్టు దోపిడీకి అడ్డుగా ఉన్న మిమ్మల్ని వారు (బీఆర్ఎస్) దోపిడీదారులుగా చిత్రీకరించారు” అని పేర్కొన్నారు. ధరణి వల్ల ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ హత్య, మల్‌రెడ్డి రంగన్న నియోజకవర్గంలో జంట హత్యలు, సిరిసిల్లలో ఒక మహిళ తన తాళిబొట్టును తీసి అధికారి కార్యాలయానికి తగిలించడంలాంటి సంఘటనలు జరిగాయని, ఇవన్నీ ధరణి వల్ల వచ్చిన సమస్యలేనని తెలిపారు. తాను పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు ధరణి అనే భూతం నుంచి విముక్తి కలిగించాలని కోరారని, అందుకే రాహుల్ గాంధీతో చెప్పించి, సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ప్రజాపాలనలో ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని, దానికి ప్రత్యామ్నాయంగా భూభారతి 2025 చట్టాన్ని తెస్తామని చెప్పామన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించామని, నిపుణులతో ఒక కమిటీ వేసి నెలల తరబడి చర్చించిన తర్వాత భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
బీఆర్ఎస్‌ను రద్దు చేస్తరా?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దొంగతనాలు కప్పిపుచ్చుకునేందుకే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
‘‘ఇంట్లోకి ఎలుక దూరితే ఎలుకను పట్టుకుంటామా? లేదా ఇల్లు తగలబెట్టుకుంటామా?.. వ్యవస్థలో 5 శాతం అక్రమార్కులు ఉన్నంత మాత్రాన మొత్తం వ్యవస్థను రద్దు చేయడం సరికాదు” అని పేర్కొన్నారు. ‘‘ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తే మళ్లీ ప్రజలకు ఇబ్బందులు వస్తాయని గత ప్రభుత్వం ప్రచారం చేస్తుంది కదా, దీన్ని ఎలా ఎదుర్కొంటారు?’’ అని తన మంత్రివర్గ సహచరులు అడిగారని చెప్పారు. ‘‘పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలంలాంటి ప్రాజెక్టులు నేటికీ ఉన్నాయి. మరి గత పాలకులు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది కదా. కూలిపోయిన కాళేశ్వరాన్ని చూపించి ఆ పార్టీని రద్దు చేస్తారా?’’ అని తాను ప్రశ్నించానని రేవంత్ రెడ్డి తెలిపారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలిపోయిందని, మరి వారిపై ఏం చర్యలు తీసుకోవాలని అడిగారు. ఈ ప్రశ్నకు గ్రామ పాలన అధికారులు గ్రామ గ్రామాన సమాధానం చెప్పాలని అన్నారు. ప్రజలకు సేవలు అందించి, వారి నమ్మకాన్ని గెలుచుకోవాలని సూచించారు.
రాష్ట్ర సాధనకు కృషి చేసినోళ్లను పట్టించుకోలే
తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యాయులు, ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖ కార్మికులు క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ మాజీ సీఎం కేసీఆర్ గుర్తింపు, గౌరవం కల్పించలేదని అన్నారు. గత పదేండ్లలో దాదాపు 55–-60 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా.. వారి సమస్యలను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలు కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. పైగా రెవెన్యూ సిబ్బందిని ‘ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు’ అన్నట్టుగా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారని అన్నారు.
రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా మారాలి
గ్రామ పాలనాధికారులు పేద రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా మారాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అలాగే, దాదాపు 8-9 లక్షల సాదా బైనామాల అప్లికేషన్లను కూడా అమలు చేయాల్సిన బాధ్యత జీపీవో లపై ఉందని తెలిపారు. సాదా బైనామాలను ఎక్కడ వివాదాలకు తావు లేకుండా అమలు చేస్తారని మంత్రివర్గానికి తాను హామీ ఇచ్చానని చెప్పారు. ఇది కేవలం ఉద్యోగం కాదని, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని, ఇది ఒక భావోద్వేగమని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు, భూమికి అవినాభావ సంబంధం
తెలంగాణ ప్రజలకు, భూమికి అవినాభావ సంబంధం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారిని తెలంగాణ ప్రజలు తరిమికొట్టారని చెప్పారు. తెలంగాణలో అన్ని పోరాటాలు భూమి చుట్టూనే తిరిగాయని అన్నారు. కుమ్రం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, రావి నారాయణరెడ్డి తదితరులు భూమి కోసమే పోరాడారని తెలిపారు. భూదాన ఉద్యమంలో పోచంపల్లి గ్రామం ‘భూదాన్ పోచంపల్లి’గా ప్రపంచ చరిత్రలోనే గుర్తింపు సాధించిందని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కృషి వల్ల అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ద్వారా వేలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేశారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 10 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలను పేదలకు పంపిణీ చేసినట్టు తెలిపారు.
గత ప్రభుత్వం టీవీలు, పేపర్లను అడ్డం పెట్టుకొని మీపై విష ప్రచారం చేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఆ తప్పుడు ప్రచారం ప్రజల మెదళ్లలో బలంగా నాటుకుపోయింది. గతంలో మన మీద వేసిన ముద్రను తొలగించుకోవడమే కాదు, ముద్ర వేసిన ఆనాటి పాలకులు.. ధరణి పేరు మీద పాల్పడ్డ దోపిడీలను ప్రజలకు వివరించాలి. మీ మీద, నా మీద ఉన్న ఆరోపణలను తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. దాన్ని నిరూపిద్దాం. - సీఎం రేవంత్ రెడ్డి
