స్కూల్‌ యూనిఫామ్‌లు కుట్టే ఆర్డర్లు.. మహిళా సంఘాలకు ఇస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

స్కూల్‌ యూనిఫామ్‌లు కుట్టే ఆర్డర్లు.. మహిళా సంఘాలకు ఇస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

స్కూల్‌ యూనిఫామ్‌లు కుట్టే ఆర్డర్లు మహిళా సంఘాలకు ఇస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మహిళలకు ఉచిత బస్సు రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు చూస్తన్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌ దర్బార్ హాల్ లో మహిళా సంఘాల సభ్యులతో సీఎం రేవంత్‌ రెడ్డి ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో మహిళల కష్టాలు, విజయాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టీ, మంత్రులు సీతక్క, కొండా  సురేఖ, కోమటిరెడ్డి పలువురు పాల్కొన్నారు. 

ఇందిరమ్మ పాలనలో మహిళా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.  మహిళలు ఆత్మ గౌరవంతో బతకాలనేదే మా ప్రభుత్వ ఉద్డేశమని చెప్పారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోబోతున్నామని వివరించారు. త్వరలో రూ. 500 సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీ అమలు చేస్తామని చెప్పారు. మహిళా సంఘాలకు రూ. 60 కోట్ల బ్యాంక్ లింకేజ్ నిధులు కేటాయించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు భూములు, ఇండ్లు దక్కాయన్నారు రేవంత్ రెడ్డి. 

అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 2) మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ పూజల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నాగోబా దర్శనానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మోస్రా వంశీయులు ఘనంగా స్వాగతం పలికారు. 

అనంతరం ప్రత్యేక దర్బార్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. నాగోబా జాతర నిర్వహణకు ఇప్పటికే నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. రూ. 6 కోట్లతో నాగోబా ఆలయ  అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం రూ. 5 కోట్లతో నిర్మించిన ఆలయ గోపురానికి ప్రారంభోత్సవం చేశారు.