సినీ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్.. స్కిల్ డెవలప్‌‌మెంట్ : సీఎం రేవంత్

సినీ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్.. స్కిల్ డెవలప్‌‌మెంట్ : సీఎం రేవంత్
  • తెలుగు సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం రేవంత్​
  • కార్మికులను విస్మరించొద్దని నిర్మాతలకు సూచించినట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ విషయంలో సినిమా కార్మికుల నైపుణ్యాలను పెంపొందించేందుకు సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం జూబ్లీహిల్స్‌‌లోని తన నివాసంలో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు సూచించినట్టు తెలిపారు. కార్మికులలో నైపుణ్యాల పెంపునకు సహకరించాల్సిందిగా కోరానని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తామని, తద్వారా వారు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా సహకరించాలని, చిన్న సినిమా నిర్మాతలకూ తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. 

పరిశ్రమలో పని వాతావరణం చెడగొట్టుకోవద్దని, సమ్మెలకు వెళ్తే ఇరువైపులా నష్టం జరుగుతుందని సీఎం అన్నారు. సినిమా కార్మికుల సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, వారి తరఫున నిర్మాతలతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. తాను కార్మికుల పక్షాన ఉంటానని, అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలు కూడా తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. 

సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందించే ప్రయత్నం చేస్తామని, గద్దర్ అవార్డుల మాదిరిగానే సినీ కళాకారులకు కూడా తగిన గౌరవం కల్పిస్తామని తెలిపారు. పదేండ్లుగా ఏ సీఎం కూడా సినిమా కార్మికులను పిలిచి మాట్లాడలేదని ఈ సందర్భంగా సంఘాల నాయకులు అన్నారు. తమ సమస్యలను వినడానికి సీఎం ముందుకు రావడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.

 సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, తెలుగు సినీ పరిశ్రమ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, వివిధ సినీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.