- మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ల నిర్మాణానికి అనుమతులివ్వాలి: సీఎం రేవంత్
- దేశానికి రెండో రాజధాని హోదా అడగట్లే.. ఆ స్థాయికి తగిన మౌలిక వసతులు కల్పించండి
- అభివృద్ధిలో రాజకీయాల్లేవు.. పెద్దన్నగా ప్రధాని రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునివ్వాలి
- ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మెట్రో నగరాలకు ప్రత్యేక అర్బన్ పాలసీ రూపొందించాలి
- పట్టణాభివృద్ధి శాఖ రీజినల్ మీటింగ్‌లో సీఎం ప్రసంగం
- రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తం: కేంద్ర మంత్రి ఖట్టర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో పట్టణాభివృద్ధి శాఖ రీజినల్ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీని ‘పెద్దన్న’గా అభివర్ణించిన సీఎం, ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునివ్వాలని కోరారు. మాజీ సీఎంలుగా మోదీకి, ఖట్టర్‌కు.. ముఖ్యమంత్రుల కష్టాలు బాగా తెలుసునని, అందుకే తనలాంటి యువ సీఎంలకు మార్గదర్శకం చేస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచం ఒక యూనిట్‌గా మారిన నేపథ్యంలో తాము అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడాలనుకుంటున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే అత్యాధునిక ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మించబోతున్నామని, ఇందుకు కేంద్రం అండగా నిలవాలని కోరారు.
గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలోనే హైదరాబాద్‌లో మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును చేపట్టామని, దీనికి కేంద్రం ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రెండో దశ మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్), రేడియల్ రోడ్ల నిర్మాణానికి అనుమతులతో పాటు సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు.
నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు రాబోయే ఏడాది కాలంలో 3 వేల ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని, అలాగే, మూసీ ప్రక్షాళన కోసం సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (ఎస్‌టీపీ) ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. తమకు పొరుగు రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదని, తమ పోటీ అంతా న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్‌లాంటి అంతర్జాతీయ నగరాలతోనే ఉంటుందని చెప్పారు.
మేం మిత్రులకు మిత్రులం: మనోహర్ లాల్ ఖట్టర్
కేంద్రం తరఫున రాష్ట్రాలకు పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ‘‘మేము మిత్రులకు మిత్రులం. ఎవరు మాకు సహకరిస్తారో.. వారికి మేం రెట్టింపు సహకారం అందిస్తాం. మీరు అభివృద్ధి దిశగా ఒక అడుగు ముందుకేస్తే.. మేం మీతో కలిసి 4 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం రెండు మూడు నిమిషాల్లో స్వాగతోపన్యాసం ముగిస్తారని అనుకున్నా.. కానీ ఆయన స్వాగతం పలుకుతూనే, ఆ సాకుతో చెప్పాల్సినవన్నీ చెప్పేశారని అన్నారు. రాష్ట్రానికి ఏం కావాలో, కేంద్రం నుంచి ఏం ఆశిస్తున్నారో ఆ చిట్టా మొత్తం తమ ముందుంచారని తెలిపారు.
‘‘దేశాన్ని 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. అయితే ‘వికసిత్ భారత్’ అనేది కేవలం ఢిల్లీలో కూర్చొని ప్రధాని మోదీ , కేంద్ర ప్రభుత్వమో ఇచ్చే నినాదం వల్ల సాధ్యం కాదు. దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి గ్రామం, చివరికి ప్రతి పౌరుడు అభివృద్ధి చెందినప్పుడే అది సాధ్యమవుతుంది’’ అని పిలుపునిచ్చారు.
దేశంలో పట్టణీకరణ అత్యంత వేగంగా జరుగుతున్నదని ఖట్టర్ గణాంకాలతో సహా వివరించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో 60 శాతం వాటా పట్టణ ప్రాంతాల నుంచే వస్తున్నదని, భవిష్యత్తులో నగరాలను మరింత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రి పీ నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
మెట్రోపాలిటన్ నగరాలపై ఫోకస్ పెట్టాలి
దేశాభివృద్ధిలో పట్టణీకరణే కీలకమని, చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలంటే మెట్రోపాలిటన్ నగరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నా.. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లాంటి 5 నగరాలే దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులని పేర్కొన్నారు. అందుకే ఈ నగరాల అభివృద్ధికి కేంద్రం ఒక ప్రత్యేక అర్బన్ పాలసీని రూపొందించాలని సూచించారు.
దేశ రాజధాని ఢిల్లీలోలాగా హైదరాబాద్‌లో కాలుష్యం పెరగకుండా ముందుచూపుతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా డాక్టర్ బీఆర్అంబేద్కర్ ప్రతిపాదించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. తాము ఆ హోదా అడగట్లేదు కానీ, ఆ స్థాయికి తగ్గ మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నామన్నారు.
దేశాన్ని 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి తగ్గట్టుగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘తెలంగాణ రైజింగ్-2047’ పేరుతో బృహత్తర ప్రణాళికలు రచిస్తున్నదని వివరించారు. దీనికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభాలో 2.5 శాతంగా ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీలో 5 శాతం వాటా అందిస్తున్నదని, 2047 నాటికి దీనిని 10 శాతానికి పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు.
2034 నాటికి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఇందుకు కేంద్రం సహకారం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 70 శాతం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) హైదరాబాద్‌కే వచ్చాయని.. ఐటీ, ఫార్మా, మెడికల్ హబ్‌గా నగరం మారిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఐటీ, ఫార్మా రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మారిన హైదరాబాద్‌కు కేంద్రం చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తామని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
