- ఉత్తమ ప్రజా సేవకునిగా ఎంపిక
- నేడు కేరళలోని నిలంబూర్‌లో ప్రదానం
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. కేరళ దిగ్గజ కాంగ్రెస్ నేత, దివంగత ఆర్యాడన్ మహమ్మద్ స్మారకార్థం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ‘ఆర్యాడన్ మహమ్మద్ - 2026’ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ (ఉత్తమ ప్రజా సేవకుడు) అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టి గల ప్రజాస్వామిక నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కినట్టు ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యాడన్ షౌకత్ తెలిపారు.
ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఎ.పి. అనిల్ కుమార్, ప్రముఖ మేధావి కల్పేట్టా నారాయణన్‌తో కూడిన జ్యురీ రేవంత్ రెడ్డి నిబద్ధతను ప్రత్యేకంగా కొనియాడింది. ఆర్యాడన్ మహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేరళలోని నిలంబూర్‌లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్మారక ఉపన్యాసం చేయనున్న ఈ వేడుకలో.. రేవంత్ రెడ్డికి రూ. లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేయనున్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా సేవలందించి నిజాయతీ, లౌకిక విలువలు, కార్మిక సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన ఆర్యాడన్ మహమ్మద్ జ్ఞాపకార్థం ఈ అవార్డును ఇస్తున్నారు.
