
- అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులకు సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చి రెండేండ్లు దగ్గరికి వస్తున్నా కొందరు అధికారుల పనితీరులో మార్పులేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని చెప్పారు.
ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని, అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు. శనివారం ఉదయం తన నివాసంలో సీఎంవో కార్యదర్శులు, సీఎస్ రామకృష్ణారావుతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాలని ఆయన ఆదేశించారు. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్ కు చెప్పారు.
ప్రతివారం నివేదికలు ఇవ్వండి
ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సీఎంవో అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఎక్కడా ఫైలు ఆగిపోవడానికి, పనులు ఆగిపోవడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులకు స్పష్టం చేశారు.
ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే, కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇకపై సీఎస్ తో పాటు సీఎంవో అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం రేవంత్ తెలిపారు.