
- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మా లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం అమెరికన్ల మద్దతు కోరుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తాజ్‌కృష్ణలో హైదరాబాద్ కాన్సుల్ జనరల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. ‘‘అమెరికా, తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాం.
అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్ర్యం వచ్చాక ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా, నిరంతరం ఆవిష్కరణలను అందించడం ద్వారా అమెరికా ప్రపంచ దృక్పథాన్ని మార్చింది. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలకు చెందిన దాదాపు 200 అమెరికా కంపెనీలు ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి’’ అని రేవంత్ అన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే యూఎస్ కాన్సులేట్
2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ ఆఫీస్ ఏర్పాటైందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఇండియాతో దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో అమెరికా ఎంతో నిబద్ధతను ప్రదర్శించిందని అన్నారు. ‘‘అమెరికాతో తెలుగు ప్రజలకు ఉన్న స్నేహపూర్వకమైన బంధం ఎంతో బలమైంది. అక్కడ తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ వేడుకల థీమ్ అయిన ‘‘ఒక్కటిగా ఉంటే.. మరింత పటిష్టంగా..’’ ఎదగగలమని నేను విశ్వసిస్తున్నాను’’ అని రేవంత్ అన్నారు.