సీనియర్ ఆటగాళ్లతో కళకళలాడుతున్న బీసీసీఐ సీఓఈ..

సీనియర్ ఆటగాళ్లతో కళకళలాడుతున్న బీసీసీఐ సీఓఈ..

బెంగళూరు: రాబోయే ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్‌‌ల కోసం ఇండియా మెన్స్ క్రికెట్ టీమ్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌లెన్స్ (సీఓఈ) ఆటగాళ్లతో కళకళలాడుతోంది. దులీప్ ట్రోఫీ క్వార్టర్‌‌ఫైనల్ మ్యాచ్‌‌లు జరుగుతున్న ఇదే సమయంలో అనేక మంది సీనియర్లు, యంగ్‌‌స్టర్లు ఫిట్‌‌నెస్ పరీక్షల కోసం ఇక్కడికి చేరుకున్నారు. శనివారం ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, బ్యాటర్లు శుభ్‌‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఆల్‌‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తదితర ఆటగాళ్లు సీఓఈకి వచ్చారు. 

వీరంతా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియాన్ లే రౌక్స్ ఆధ్వర్యంలో తప్పనిసరి ప్రి సీజన్ ఫిట్‌‌నెస్ టెస్టులకు హాజరవుతారు.  ఆసియా కప్ కోసం ఎంపికైన ఆటగాళ్లు తమ సన్నాహాలను సీఓఈలోనే కొనసాగించనున్నారు.  కాగా, టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అయిన రోహిత్‌‌కు ఆదివారం ఫిట్‌‌నెస్ పరీక్ష జరగనుంది. దాంతో అందరి ఫోకస్ అతనిపైనే ఉంది. అక్టోబర్‌‌లో ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీస్‌‌లో తను బరిలోకి దిగనున్నాడు.  సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్‌‌లో ఆస్ట్రేలియా--–ఎతో జరిగే మూడు వన్డేల్లో అతను ఇండియా-–-ఎ తరపున ఆడే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. 

ఇక,  ఇంగ్లండ్‌‌ టూర్ ముగిసిన తర్వాత గిల్‌‌కు జ్వరం రావడంతో ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌‌ నుంచి వైదొలిగాడు. గిల్ తన హోమ్‌‌టౌన్ చండీగఢ్‌‌లో కోలుకున్న తర్వాత బెంగళూరు చేరుకున్నాడు. ఇతర ఆటగాళ్ల మాదిరిగానే గిల్ కూడా నేరుగా బెంగళూరు నుంచి సెప్టెంబర్ 4న దుబాయ్‌‌కి వెళ్లే అవకాశం ఉంది. ఆసియా కప్‌‌లో భాగంగా ఇండియా జట్టు సెప్టెంబర్ 9న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది.  

ఈ టోర్నీకి ఎంపికైన అర్ష్‌‌దీప్ సింగ్ (నార్త్ జోన్), హర్షిత్ రాణా (నార్త్ జోన్), కుల్దీప్ యాదవ్ (సెంట్రల్ జోన్) ఇప్పటికే దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌‌లో ఆడుతున్నారు. మరోవైపు, తిలక్ వర్మ స్థానంలో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్స్‌‌కు సౌత్ జోన్ కొత్త కెప్టెన్‌‌ను ఎంపిక చేయనుంది. కేరళకు చెందిన మహ్మద్ అజరుద్దీన్ వైస్ కెప్టెన్ కాబట్టి అతను కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. కాగా, దులీప్‌‌ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌‌కు ఆడుతున్న పేసర్  ముకేశ్‌‌ కుమార్‌‌‌‌కు గాయమైంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌‌లో మొదటి ఇన్నింగ్స్‌‌లో గజ్జల్లో గాయం కావడంతో అతను రెండో ఇన్నింగ్స్‌‌లో బౌలింగ్ చేయలేదు.