
పారిస్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి అదిరిపోయే ఆటతో పతకం ఖాయం చేసుకున్నారు. తమ చిరకాల ప్రత్యర్థులు మలేసియాకు చెందిన ఆరోన్ చియా– సోహ్ వూయ్ యిక్‌కు చెక్ పెడుతూ మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్నారు. గతేడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఇదే జంట చేతిలో ఓడిపోయి పతకం కోల్పోయిన బాధకు ప్రతీకారం తీర్చుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నంబర్ 3 జోడీ సాత్విక్–-చిరాగ్ 21-–12, 21–-19తో వరుస గేమ్స్‌లో ఆరోన్ చియా- –సోహ్ వూయ్‌ను ఓడించింది.
దాంతో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండోసారి పతకం ఖాయం చేసుకుంది. 2022 ఎడిషన్‌లో ఈ జోడీ కాంస్య పతకం గెలిచింది. ఈ ఏడాది సింగపూర్, చైనా ఓపెన్‌లోనూ తొమ్మిదో ర్యాంకర్స్ ఆరోన్–సో చేతిలో ఓడిన సాత్విక్–చిరాగ్ ఈసారి వాళ్లకు ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా 43 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించారు. తొలి గేమ్ చిరాగ్ దూకుడైన ఆటతో ప్రారంభమైంది. ఆ తర్వాత సాత్విక్ బలమైన సర్వీస్‌లు కొట్టడంతో 9–-3 ఆధిక్యంలోకి వెళ్లారు.
బ్రేక్ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ ఈజీగా గేమ్ నెగ్గారు. రెండో గేమ్‌లోనూ స్టార్టింగ్ నుంచే విజృంభించి 10–-5 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, మలేసియన్లు పుంజుకుని 18-–19తో పోటీలోకి వచ్చారు. కానీ, చివర్లో మెరుగ్గా ఆడిన చిరాగ్ అద్భుతమైన నెట్ ప్లే, స్మాష్‌లతో మ్యాచ్ పాయింట్ అందుకున్నాడు.