- అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఆలయ సిబ్బంది
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య భక్తులు
- ఫిర్యాదులు చేసినా లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు
- ఇయ్యాల మల్లన్న బ్రహ్మోత్సవాల పనులపై రివ్యూ
- ఆలయంలో దోపిడీపై చర్చించాలని భక్తుల డిమాండ్
హనుమకొండ/వర్ధన్నపేట, వెలుగు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తులను నిలువునా దోచేస్తున్నారు. మల్లన్నకు పట్నం వేసినా, తలనీలాలు ఇచ్చినా ఆలయ సిబ్బంది టోకెన్ చార్జ్ పోను.. అదనంగా రూ.వందల్లో వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా పట్నం వేయిస్తే రూ.500 తగ్గకుండా ముట్టజెప్పితేనే ఒగ్గుపూజారులు పదం పాడటం లేదు. ఫలితంగా సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మేడారం జాతర సమీపిస్తున్న వేళ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. దీంతో ఇదే అదనుగా భక్తులను ఆలయ సిబ్బంది ముక్కుపిండి అక్రమ వసూళ్లకు పాల్పడుతు న్నారు. ఇది తెలిసినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. శనివారం ఐలోని మల్లన్న బ్రహోత్స వాలపై రివ్యూ నిర్వహించనున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది దోపిడీ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని భక్తుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
పట్నం వేయాలంటే.. రూ.వెయ్యి ఖర్చు
మేడారం సమ్మక్క,సారలమ్మ మహాజాతర జనవరి నెలాఖరులో జరగనుండగా.. తల్లుల దర్శనానికి ముందు భక్తులు ఐనవోలు మల్లికార్జునస్వామికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. కొద్దిరోజులుగా మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది.
సంక్రాంతి నుంచి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, ఆలోపు మొక్కులు చెల్లించేందుకు భక్తులు తరలివస్తుండగా సందడిగా ఉంది. ఇదే అదనుగా ఆలయంలో కొందరు వ్యాపారులు, ఒగ్గు పూజారులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. మల్లన్న పట్నం వేసే భక్తులు ఆలయ కౌంటర్ లో రూ.150 చెల్లించి టోకెన్ తీసుకుని ఇస్తే.. ఒగ్గు పూజారులు మల్లన్న పట్నం వేయాలి. అనంతరం భక్తులు కొంత దక్షిణగా ఇచ్చుకుంటుంటారు. అయితే.. మల్లన్న పట్నం వేసేందుకు ఒగ్గు పూజారులు రూ.500 తగ్గకుండా డిమాండ్ చేస్తున్నారు.
పట్నం వేసే ముందు మైలపోలు మీద రూ.100 నుంచి రూ.200, ఆ తర్వాత పట్నం మీద ఇష్టానుసారంగా రూ. వందల్లో వసూ లు చేస్తున్నారు. దీంతో మల్లన్న పట్నం వేయాలంటే రూ.వెయ్యి వరకు ఖర్చవుతుందని భక్తులు వాపోతున్నారు.
తలనీలాలకు రూ.200 ఇవ్వాల్సిందే..
భక్తులు తలనీలాలు ఇచ్చేందుకు రూ.50 టోకెన్ తీసుకుంటున్నా.. ఆలయ సిబ్బందికి అదనంగా ముట్టజెప్పనిదే తంతు పూర్తి చేయడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్ కు చెల్లించిన పైసలు కాకుండా రూ.100 నుంచి రూ.200 ఇస్తే తప్ప గుండుపై చేయి వేయడం లేదని వాపోతున్నారు. ఇలా ప్రతి సేవకూ ఆలయ సిబ్బంది అదనంగా వసూలు చేస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ అడిగినంత ఇవ్వకపోతే పట్నం మధ్యలో ఆపేయడమో, లేదంటే వాదనకు దిగడమో చేస్తున్నారని పేర్కొంటున్నారు.
ఆలయ పరిసరాల్లో షాపుల్లోనూ అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రూ.30 కొబ్బరికాయకు రూ.50కి తగ్గకుండా అమ్ము తున్నారు. వాటర్ క్యాన్ కు రూ.20పైగా తీసుకుంటున్నారు. స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో రేట్లు మరింత పెంచడంతో, సామాన్య భక్తులపై ప్రభావం పడుతుంది. ఇదే విషయమై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని భక్తులు విమర్శిస్తున్నారు.
రివ్యూ మీటింగ్ లో చర్చించాలని భక్తుల డిమాండ్
ఐనవోలు ఆలయ బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 13 నుంచి ప్రారంభంకానుండగా.. జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. జాతర సందర్భంగా చేయాల్సిన పనులు, ఆలయంలో ఇబ్బందులు తదితర సమస్యలపై శనివారం హనుమకొండ కలెక్టరేట్ లో ప్రజాప్రతిధులు, ఆఫీసర్లు రివ్యూ చేయనున్నారు. జాతరలో పెండింగ్ పనులు, రోడ్ల రిపేర్లు, ఇతర సమస్యలపై చర్చించనున్నారు.
కాగా ఆలయ సిబ్బంది అదనపు అక్రమ వసూళ్లతో భక్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీనిపై తగు నియంత్రణ చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. అధిక వసూళ్లకు తావులేకుండా సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అడిగినంత ఇవ్వకపోతే మధ్యలోనే ఆపేస్తున్నరు
రెండువారాల కింద మల్లన్నకు మొక్కులు చెల్లించేందుకు వెళ్లినం. తలనీలాలకు రూ.50 టోకెన్ తీసుకున్నా. గుండు చేసిన అనంతరం మరో రూ.100 డిమాండ్ చేశారు. పట్నం వేసినందుకు రూ.150 టోకెన్ పోనూ రూ.700 వరకు ఖర్చయింది. వాళ్లు అడిగినంత ఇవ్వకపోతే పట్నం మధ్యలోనే ఆపేస్తున్నరు. చేసేదేమీ లేక అడిగినంత ఇచ్చినం. భక్తుల నిలువు దోపిడీకి అడ్డుకట్ట వేయాలి.
-శ్రీపతి హరీశ్, భక్తుడు, హనుమకొండ-
రూ.600 ఇచ్చేదాకా పట్టుబట్టారు
వారం కింద మల్లన్న ఆలయంలో పట్నం వేసేందుకు రూ.150 టోకెన్ తీసుకున్నాం. తీరా పట్నం వేశాక ఒగ్గు పూజారులు రూ.600 డిమాండ్ చేశారు. సంతోషంగా రూ.300 ఇచ్చినా తీసుకోకుండా ఇబ్బంది పెట్టారు. చివరకు వాళ్లు అడిగినంత ఇచ్చాం. అధికంగా వసూలు చేస్తుండడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- లింగాల శ్రీనివాస్, భక్తుడు, ములుగు-
