- ఎల్కతుర్తి మండలంలోని ఇనుపరాతి గుట్టల్లో 50 ఎకరాల భూమి చదును
- రోడ్డు కోసం రెండు కిలోమీటర్ల పొడవునా చెట్ల తొలగింపు
- అన్నీ తెలిసినా ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు
- ఉద్యమానికి సిద్ధమవుతున్న ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు
హనుమకొండ, వెలుగు : హనుమకొండ జిల్లాలోని ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంతం క్రమంగా కబ్జాకు గురవుతోంది. కొందరు వ్యక్తులు పట్టా ల్యాండ్ పేరుతో ఫారెస్ట్ ఏరియాలోని 50 ఎకరాలను పూర్తిగా చదును చేశారు. అక్కడికి వాహనాలు వెళ్లేందుకు వీలుగా... సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా ఉన్న చెట్లన్నింటినీ నరికేసి రోడ్డు వేశారు. ఈ విషయం ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంతానికి హద్దులు లేకపోవడంతో ఆక్రమణకు గురవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు.
50 ఎకరాలు చదును.. రోడ్లు కోసం చెట్ల నరికివేత
హనుమకొండ జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలోని 4,887 ఎకరాలకుపైగా భూముల్లో ఇనుపరాతి గుట్టలు ఉండేవి. ఈ అటవీ ప్రాంతానికి సరైన హద్దులు లేకపోవడం వల్ల చుట్టూ ఆక్రమణలు పెరగడంతో... ప్రస్తుతం ఇనుపరాతి గుట్టలు 3,975 ఎకరాలకే పరిమితం అయ్యాయి. ఇందులో ధర్మసాగర్ మండలం దేవునూరు శివారులో 1,095 ఎకరాలు, ముప్పారం శివారులో 906, వేలేరు మండలం ఎర్రబెల్లి శివారులో 820, ఎల్కతుర్తి మండలం దామెర శివారులో 560, భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో 594 ఎకరాలు ఉన్నాయి. ఈ ఫారెస్ట్ భూములను ఆనుకునే చుట్టూ పట్టా భూములు ఉండటం, ఈ రెండింటి మధ్య హద్దులు లేకపోవడంతో తరచూ వివాదాలు ఏర్పడుతున్నాయి. ఎల్కతుర్తి మండలం దామెర శివారులోని సర్వే నెం.496లో వివిధ బై నంబర్లలో సుమారు 54 ఎకరాల సీలింగ్ ల్యాండ్, 330 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. 496లోని మరికొన్ని బై నంబర్లలో మరో 100 ఎకరాల వరకు అటవీ, ప్రభుత్వ భూమి ఉంది. ఇటీవల కొందరు వ్యక్తులు ఇనుపరాతి గుట్టల్లోని కొంత భూమిని చదును చేశారు. వాహనాల రాకపోకలకు వీలుగా.. దామెర శివారు నుంచి గుట్టల వైపు సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా గతంలో ఉన్న ఐదారు ఫీట్ల బండ్ల బాటను 15 ఫీట్ల మేర వెడల్పు చేశారు. ఇందుకోసం రోడ్డు పొడవునా ఉన్న వందలాది చెట్లను తొలగించారు. అయితే చదును చేసిన భూమికి పట్టాలు ఉన్నాయని వారు చెబుతుండగా.. అది ఫారెస్ట్‌కు సంబంధించిన ల్యాండ్ అని మరికొందరు అంటున్నారు.
పట్టించుకోని ఆఫీసర్లు
ఇనుపరాతి గుట్టల్లోని భూములను చదును చేసేందుకు పది రోజుల కిందే మట్టి బాట వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజు జేసీబీలు, టిప్పర్లు నడిచినా, బాట కోసం వందలాది చెట్లను తొలగించినా సంబంధిత శాఖ ఆఫీసర్లు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి వాల్టా యాక్ట్ ప్రకారం చెట్లను తొలగించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు వాటిని తొలగించేందుకు ఉపయోగించిన వెహికల్స్‌ను కూడా సీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరుగకపోవడంతో ఆఫీసర్లకు తెలిసే ఈ తతంగమంతా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇనుపరాతి గుట్టల పరిరక్షణకు ఉద్యమం
ఇనుపరాతి గుట్టల్లో పెద్దేగి, మద్ది, నారేప, సండ్ర, వివిధ రకాల మెడిసినల్ ప్లాంట్స్‌తో పాటు 200కుపైగా పక్షి జాతులు, కోతులు, జింకలు, దుప్పులు, కుందేళ్లు, నెమళ్లు, ఎలుగుబంట్లు వంటి జీవజాతులు ఉన్నాయి. ఈ ఫారెస్ట్ ఏరియాలోనే ఎకో టూరిజం పార్క్ ఏర్పాటుకు ప్రపోజల్స్ జరుగుతున్నాయి. ఇనుపరాతి గుట్టల్లో క్వార్ట్జ్ మైనింగ్ కోసం గతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు, స్థానిక ప్రజలు ఆందోళనలకు దిగడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా దామెర శివారులో భూమిని చదును చేస్తున్నారని తెలియడంతో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ ప్రతినిధులు ఇటీవల ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇనుపరాతి గుట్టలతో పాటు అటవీ ప్రాంత పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు
కోరుతున్నారు.
ఇనుపరాతి గుట్టలను పరిరక్షించాలి
ఇనుపరాతి గుట్టల్లో ఎన్నో విలువైన మొక్కలు, చెట్లు, జీవజాతులున్నాయి. ఇష్టారీతిన చెట్లను తొలగించడం వల్ల ఫారెస్ట్ ఏరియా తగ్గి జీవజాతులకు ముప్పు ఏర్పడుతోంది. గతంలో ఇనుపరాతి గుట్టల్లో మైనింగ్ నిర్వహణకు అనుమతులు ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఇనుపరాతి గుట్టల్లోని అటవీ ప్రాంతంతో పాటు అందులోని జీవజాతుల పరిరక్షణకు గ్రామస్తులతో కలిసి పోరాటం చేస్తాం. - నాగేశ్వరరావు, చెలుపూరి శ్యాం, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు
