సీఎం రేవంత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలె

సీఎం రేవంత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలె

 డిసెంబర్ ఏడో తేది నుంచి జరుగుతున్న సంఘటనలు, ప్రగతిభవన్​ను జ్యోతిరావు పూలె భవనంగా ప్రజలకు అందుబాటులోకి తేవటం, ప్రజా దర్బార్ నిర్వహించటం, సచివాలయం లోకి ప్రజలు స్వేచ్ఛగా వెళ్లి తమ పనులకు సంబంధించి అర్జీలు ఇవ్వటానికి  అనుమతించటం చూస్తే ప్రజా పాలనవైపు అడుగులు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణ ప్రజలు, సచివాలయ సిబ్బంది ఎంత స్వేచ్ఛగా సంబురాలు జరుపుకున్నారో చూసాం. పది సంవత్సరాల నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొందిన ఆనందంలో ప్రజలుంటే... మరోవైపు కడియం శ్రీహరి  మాత్రం కేసీఆర్ నియంతృత్వ పాలన కోరుకోవటం, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని మరోసారి నిరూపించే విధంగా సంఖ్యా బలంతో సహా చెప్పారు.  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలు ప్రజాతీర్పును వెక్కిరిస్తున్నాయి. ఎన్నికైన ప్రజా ప్రభుత్వం కుదుటపడేందుకు అవకాశం ఇవ్వాల్సిన కనీస నైతిక బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది కదా. ప్రజల విశ్వాసం కోల్పోయిన నాడు ప్రభుత్వాలు పడిపోవడం ప్రజాస్వామ్యంలో సహజం.  అందుకే, శ్రీహరి మాటలు తెలంగాణ ప్రజలకుతీవ్ర ఆగ్రహం తెప్పించాయి. 

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఇన్నాళ్లుగా ఉన్న అడ్డుగోడలు కూలుతున్నాయి. అధికారులు, పాలకులు గత పదేండ్లలో చేసిన తప్పులకు బాధ్యత వహించి మూల్యం చెల్లించాల్సిందే. విద్యుత్ రంగంలో ఏం జరుగుతున్నది ప్రజలకు తెలిసేలా చేయాలనుకోవడం మంచి పరిణామమే . విద్యుత్ రంగం అప్పులు రూ. 81 వేల కోట్ల పైమాటే, వచ్చే ఆరు నెలల్లో ఇంకో రూ.11 వేల కోట్లు అవుతాయని అంచనా,  నెల వారి వాయిదాలకే రూ.1300 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. ఇది దాచి పెట్టి ప్రజలను మభ్యపెట్టి, పాలకులకు అడుగులకు మడుగులొత్తినవారు బతికింది, బతుకుతున్నది ప్రజల సొమ్ముతో అని మరిచి పోయినట్లున్నారు. ఇంతా చేస్తే వ్యవసాయ రంగానికి ఇచ్చింది 12 గంటలే అని ఇప్పుడు ఒప్పుకోవటం ఎవరిని వంచించటానికి?  కొందరు అధికారులు బీఆర్ఎస్ కొమ్ము కాయటమే ఈ దుస్థితికి కారణం. 

అర్థిక పరిస్థితిపై వైట్​పేపర్​ అవసరమే

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మేడిపండును తలపిస్తున్నాయి. ఐదు లక్షల కోట్లు దాటిన అప్పులు, సకాలంలో వేతనాలు ఇవ్వలేని స్థితి, అప్పులతో ఎక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పలేని గత ప్రభుత్వ అశక్తత కనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలనే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు తెలియకుండా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దాచిపెట్టిన వాస్తవాలు వెలుగు చూడబోతున్నాయి. 

ప్రజాధనం ఆదా చేయాలె, ఆకాంక్షలు నెరవేర్చాలె

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం, ఆరోగ్యలక్ష్మి బీమా మొత్తం పది లక్షల రూపాయలకు పెంచే కార్యక్రమం నిన్నటి నుంచే ప్రారంభమవటం ప్రభుత్వం పట్ల ప్రజలలో విశ్వాసం పెంచేవే. రోజులు గడుస్తున్నకొద్దీ ప్రభుత్వ హామీల అమలుపై ఒత్తిడి పెరుగుతుంది. బీఆర్ఎస్ పాలనలో అవమానాలకు, ఆక్షేపణలకు గురైన సామాన్య ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, ప్రజా సంఘాలు ఎన్నో ఆకాంక్షలతో నూతన ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక స్థితి, వనరుల సమీకరణలో అనేక పరిమితులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాళ్లుగా నిలుస్తాయి. ఒకసారి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ద్వారా స్పష్టత వస్తే, ప్రభుత్వం కార్యాచరణ నిర్ణయించుకునే వీలుంటుంది. ప్రజా ధనం ఆదా చేయటానికి ఉండే ప్రత్యామ్నాయ అవకాశాలను తక్షణమే అన్వేషించాలి. 

రేవంత్​ సామర్థ్యం, చతురతే కీలకం

గత పది సంవత్సరాలుగా అధికార మత్తులో అందలాలు ఎక్కిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచటానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం కోసం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రజలను పాలనలో భాగస్వాములను చేసే పారదర్శక పాలనతో వారి విశ్వాసం పొందవచ్చు. దానితోపాటు ఆర్థిక, రాజకీయ అంశాలలో తగిన చతురత కనబర్చటం చాలా అవసరం. ముఖ్యమంత్రి, ఉప- ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు పూర్తి అవగాహన, సంపూర్ణ సయోధ్యతో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న జాడ్యాలు తొలగించుకుంటేనే అధికారం పది కాలాలు పదిలంగా ఉంటుంది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సాధికారత పునాదులుగా అవినీతి రహిత, పారదర్శక పాలన అందించగలిగితే ప్రజలే ఈ  ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు. 

కత్తిమీద సాము చేయాల్సిందే

మద్యం అమ్మకాలు,  ప్రభుత్వ భూముల అమ్మకాలతోనే గత ప్రభుత్వం నెట్టుకు వచ్చింది. అందిన చోటల్లా అప్పులు చేయటం, ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడం, ఇష్టారాజ్యంగా ఆర్థిక వనరుల దుర్వినియోగం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం, కాగ్ సంస్థ అనేకసార్లు హెచ్చరించినా ఎట్లాంటి మార్పు లేకపోవటం గత ప్రభుత్వపు అవలక్షణాలు. ఇవన్నీ వదిలించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, ఇచ్చిన హామీలు నెరవేర్చటం, నిజ-మైన అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకం పాటించటం కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తి మీద సామే. 

హద్దులు దాటిన అధికారులు 

డా. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బాధ్యత మరిచి తప్పులు చేసిన ఐఏఎస్ అధికారులు సైతం కటకటాల పాలైన సంగతి మన స్మృతిపథం నుంచి ఇంకా చెరిగిపోలేదు. రాజకీయ నాయకులు వస్తారు, పోతారు. పాలనా పరమైన విధానాల అమలులో అధికారులు రాజ్యాంగబద్ధంగా పని చేయాలి. కానీ, బీఆర్ఎస్ పాలనలో ఇది పూర్తిగా కనుమరుగయింది. కొందరు అధికారులు అయితే బీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేసి ప్రభుత్వ భూముల ఆక్రమణ, అవినీతికి పాల్పడి వేల కోట్ల ఆస్తులు అక్రమంగా కూడబెట్టుకున్నారు. అదంతా ప్రజల ఆస్తి, వడ్డీతో సహా ఆ అధికార్ల నుంచి రాబట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అవకతవకలకు రేపు అధికారులే జవాబివ్వాల్సి ఉంటుంది. ధరణి వల్ల అగచాట్లు, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ఇష్టా రాజ్యంగా అమ్ముకున్న ప్రభుత్వ భూములు.. ఒక్కటేమిటి బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్న కాలంలో జరిగిన (సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సహా) అన్ని అక్రమాలపై సమగ్ర న్యాయవిచారణ జరగాలి, దోషులు ఎంతటివారైనా శిక్షించబడాలి. అధికారులు చట్టబద్ధ, పారదర్శక పాలనలో భాగస్వాములయ్యేలా పాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి. 

- డా. మరింగంటి యాదగిరాచార్యులు,
రిటైర్డ్​ ప్రొఫెసర్​