ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్.. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ కు అండగా నిలబడిందన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డవే పాల్వంచలోనేనని చెప్పారు. 60 ఏండ్లు ఉద్యమం నడవడానికి కారణం ఈ పాల్వంచనే అని చెప్పారు రేవంత్. 60 ఏండ్ల కలను నెరవేర్చిన మన్మోహన్ పేరును ఎర్త్ సైన్స్ వర్శిటీకి పెట్టామని చెప్పారు. సర్కార్ ఏ సంక్షేమ పథకం మొదలు పెట్టినా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించామని చెప్పారు. ఖమ్మం జిల్లాను చూసినప్పుడల్లా తన గుండె సల్లబడుతుందన్న రేవంత్.. శ్రీరాముడిసాక్షిగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.
సంక్షోభం నుంచి సంక్షేమం వైపు మన్మోహన్ సాలన సాగిందన్నారు సీఎం రేవంత్. ఆయన ప్రధానిగా ఉన్నపుడు తెలంగాణ సాధన సాధ్యమైందని..అందుకే ఎర్త్ సైన్స్ ఏకైక వర్శిటీకి మన్మోహన్ పేరుపెట్టామని తెలిపారు.కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ కోసం వేలాది ఎకరాలు భూమి ఇచ్చారని చెప్పారు. దేశంలో వ్యవసాయం అభివృద్దికి కారణం కాంగ్రెస్ అన్నారు రేవంత్. నాగార్జున సాగర్,శ్రీశైలం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నెహ్రూ కట్టినవేనని తెలిపారు. ఈ పదేళ్లలో ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. కృష్ణా,గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా తడవాలన్నారు.
ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతీ అవకాశాన్ని జిల్లాకు ఇస్తున్నామన్నారు రేవంత్. పదేండ్లు పాలించినోళ్లు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఖమ్మం జిల్లాను అభివృద్ది పథంలో నడిపించే బాధ్యత తనదన్నారు. ముఖ్యమైన శాఖలన్నీ జిల్లాకు చెందిన నాయకుల దగ్గరే ఉన్నయని.. భట్టి,తుమ్మల,పొంగులేటి తలుచుకుంటే జిల్లాకు రానిదంటూ ఏదీ లేదన్నారు. సర్కార్ ఏ సంక్షేమ పథకం మొదలు పెట్టినా..ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించామని.. సన్నబియ్యం,రేషన్ పంపిణీ ఈ జిల్లా నుంచే ప్రారంభించామన్నారు. మీ ఓటే ఆయుధంగా మారి ప్రజాపాలన అందిస్తుందన్నారు రేవంత్. మంచోడినే సర్పంచ్ గా ఎన్నుకోవాలని.. మందుకో..డబ్బుకో ఓటేస్తే ఊరు మునుగుతుందని సూచించారు రేవంత్.
