తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ లో.. 2047 కు ఓ ప్రత్యేకత ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2047 కు ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుందని తెలిపారు. తెలంగాణ భవిష్యత్ ను నిర్మించుకోవడానికి.. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్, రాజ్యాంగ నిర్మాతల నుంచి ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు. సోమవారం (డిసెంబర్ 08) భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ లో ప్రసంగించారు సీఎం రేవంత్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014 లో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిందని.. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తెలంగాణ కలలను సాకారం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అయినప్పటికీ.. ప్రపంచంలో బెస్ట్ రాష్ట్రంగా ఎదగాలన్నదే తమ కల అని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ రోడ్ మ్యాప్ విడుదల చేస్తామని తెలిపారు.
►ALSO READ | Telangana Global Summit : మాకు మాకు పోటీ లేదు.. ప్రపంచంతోనే మా పోటీ : DK శివ కుమార్
2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి చేరుకుంటుందని.. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్స్ కు చేరుకోవడమే లక్ష్యమన్నారు. ఇండియా జనాభాలో తెలంగాణ రెండు శాతమే అయినప్పటికీ జీడీపీలో 5 శాతం కాంట్రిబ్యూల్ చేస్తున్నట్లు చెప్పారు. 2047 నాటికి 10 పర్సెంట్ జీడీపీ ని దేశానికి అందిస్తామని అన్నారు.
చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ మాకు ఆదర్శం:
చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ ను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు చెప్పారు సీఎం రేవంత్. 20 ఏళ్లుగా అత్యధిక పెట్టుబడులు, ఉత్పత్తితో చైనాను లీడ్ చేస్తుందన్నారు. అదే విధంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ పోటీ చైనా, జపాన్ ల దేశాలతోనని అన్నారు. 2047 నాటికి సరికొత్త లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్.
రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి, అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు ‘తెలంగాణ రైజింగ్- 2047’ పేరుతో విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామన్నారు. ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతాన్ని ‘క్యూర్ (కోర్ అర్బన్)’గా, ఓఆర్‌ఆర్–-ట్రిపుల్ఆర్ మధ్య ప్రాంతాన్ని ‘ప్యూర్ (పెరీ అర్బన్)’గా, ట్రిపుల్ఆర్ అవతలి నుంచి తెలంగాణ సరిహద్దు వరకు ప్రాంతాన్ని ‘రేర్ (రూరల్ అగ్రికల్చరల్)’గా వర్గీకరిస్తున్నామని వివరించారు. మహిళలు, రైతులు, యువత, వివిధ సామాజిక వర్గాల ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ విజన్ డాక్యుమెంట్ రెడీ చేశామని తెలిపారు.
