కాంగ్రెస్ ను టచ్ చేస్తే మాడి మసైపోతారు : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ను టచ్ చేస్తే మాడి మసైపోతారు :   సీఎం రేవంత్ రెడ్డి

మెదక్: మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి తనదైన శైలిలో  ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం జోలికొస్తే బట్టలూడదీసి ఉరికిచ్చి కొట్టిస్తానని హెచ్చరించారు. ఇవాళ మెదక్ లో జరిగిన నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తానే పదేండ్లు సీఎంగా ఉంటానని, ప్రజా ప్రభుత్వమే కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తే హైటెన్షన్ వైరునవుతానంటూ పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్ నౌకరు పోయ్యి.. నడుం ఇరిగి, పార్టీ ఓడి పోయి, ఏం చెప్పాల్నో తెలువక ఆగమైతుండు.  పిట్టల దొర ఇంట్ల కుసోని భజన సంఘం ముందల ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ అయిపోయిందంటుండు. ఎట్లయిపోతది బిడ్డా.. అదేమన్నా రెండులీటర్ల ఫుల్ బాటిలా? 20 పెగ్గులేస్తే ఖాళీగానికి! ఈడ కాపలా ఉన్నదెవడు బిడ్డా.. ఎవడో తెలుసా.. వస్తవా.. టచ్ చేసి చూడు.. హైటెన్షన్ వైరుకు కాకి తగిలితే ఎట్లయితదో.. కాంగ్రెస్ మీద చేయి పెడితే అట్లా మాడి మసైపోతవ్ బిడ్డా! నీ తాతలు ముత్తాతలు గుర్తుకు రావాలె. నేను జైపాల్ రెడ్డిని.. జానారెడ్డిని కాదు బిడ్డా.. రేవంత్ రెడ్డిని. బట్టలిప్పదీసి రోడ్డు మీద ఉరికిచ్చి కొట్టిస్త బిడ్డా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి. మాది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేసిన ప్రభుత్వం. నువ్వు మోదీ కలిసి మా ప్రభుత్వాన్ని పడగొడ్తరా.. చీకట్ల మాట్లాడుకుంటరా.. మోదీ వస్తడో మోదీ తాతను తెచ్చుకుంటవో తెచ్చుకో’అంటూ సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశామని చెప్పారు. ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా పంద్రాగస్టు  నాటికి రైతు రుణమాఫీని కూడా అమలు చేస్తామని అన్నారు. ఐదు గ్యారెంటీలు అమలు చేస్తే పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆ ఆనందాన్ని చూసి మోదీ, కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని చెప్పారు. 

పరిశ్రమలన్నీ ఇందిరమ్మ తెచ్చినవే

కష్టకాలంలో మెదక్ ప్రాంతం ఇందిరమ్మకు అండగా నిలిచిందని అన్నారు. 1980లో ఇందిరమ్మను ఇక్కడి నుంచి పార్లమెంటుకు పంపితే ప్రధానిగా ప్రమాణం చేసి.. ఈ ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని చెప్పారు. ఇక్కడికి బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఐడీపీఎల్, ఇక్రిశాట్ లాంటి ఎన్నో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచిన చరిత్ర ఇందిరాగాంధీదని అన్నారు. పదేండ్లు పీఎంగా మోదీ, సీఎంగా కేసీఆర్, మంత్రిగా హరీశ్ రావు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదన్నారు. ‘సిగ్గు లేకుండా బీఆర్ఎస్, బీజేపీ వాళ్లొచ్చి మాకు ఓట్లేయండి.. మీ ఆకిలి అలుకుతం.. మీకు ముగ్గులేస్తం.. మీ ఇల్లు సక్కదిద్దుతమని అబద్ధాల మాటలతో బయల్దేరిండ్రు’ అంటూ ఫైర్ అయ్యారు. మోదీ చేనేతపై జీఎస్టీ తీసుకొచ్చి పద్మశాలీల బతుకులను ఆగం చేశారని అన్నారు. ఈ దెబ్బకు చేనేత పరిశ్రమలన్నీ మూతపడ్డయని ఓ నిరుద్యోగ యువకుడు చెప్పారన్నారు. పదేండ్లు అధికారం వెలగబెట్టిన వీళ్లు మెదక్ ప్రాంతానికి తెచ్చిన పరిశ్రమలెన్నో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.  

ఏకాణా ఇయ్యలే

‘బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో ఎమ్మెల్యగా గెలిపిస్తే మోదీతో కొట్లాడి ప్రత్యేకంగా నిధులు తెస్తానన్నడు. మేమంతా బస్ ఏసుకొని దుబ్బాకకు వస్తం.. నువ్వు తెచ్చిన నిధులెన్ని.. మోదీ ఇచ్చిన పరిశ్రమలెన్ని చూపించాలె. దుబ్బాకలో ప్రజలు తిరస్కరిస్తే.. రంగు మార్చుకొని మెదక్ పార్లమెంటులో ఓటెయ్యుమని బయల్దేరిండు.. రఘునందన్ రావుకు ఓటేస్తే మోదీ ప్రధాన మంత్రికాకుండా చంద్రమండలానికి రాజైతడా..? పదేండ్లు ప్రధానిగా  ఉన్న మోదీ ఇప్పుడు గెలుస్తే పరిశ్రమలు తెస్తడా..?’ అని ప్రశ్నించారు.   ప్రధాన మంత్రికే మోదీ, సీఎంగా కేసీఆర్ మెదక్ ప్రాంతానికి ఏకాణా ఇయ్యలేదంని ఫైర్ అయ్యారు. 

కారును తుక్కు కింద అమ్మాల్సిందే

‘కేసీఆర్ పని అయిపోయింది.. లేవలేకుంట పడ్డడు.. కారేమో కార్ఖానాకు పోయింది. ఇగ దుకాణం బందైంది.. తుక్కుకింద దాన్ని అమ్మాల్సిందే.. ఫాంహౌస్ ముందు ఒకడు తిరుగుతున్నడు.. వాడు ఒక్కటే స్లోగన్ ఎత్తుకున్నడు.. పాత సామాన్లు కొంటం.. పాత సామాన్లు కొంటం అని.. నేను ఒకడిని పంపించి అడిగించిన.. ఏందిరా వాడు ఆడనే తిరుగుతుండు అంటే.. కారు షెడ్డుకు  పోయింది కదా.. ఖరాబైంది కదా.. ఇగ తూకం కింద కొందామని వచ్చినా అన్నడట.’అని అన్నారు.