ఇగోలు పక్కన పెడదాం..14 సీట్లు గెలుద్దాం : రేవంత్​ రెడ్డి

ఇగోలు పక్కన పెడదాం..14 సీట్లు గెలుద్దాం : రేవంత్​ రెడ్డి
  • కలిసి ముందుకు సాగుదాం.. కాంగ్రెస్ ​నేతలతో సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి
  • పదేండ్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినం
  • కార్యకర్తల సపోర్టు ఉంటేనే పదేండ్లు పవర్​లో ఉంటం
  • సర్వేలు, సమీకరణాల ఆధారంగానే ఎంపీ టికెట్లు
  • కేసీఆర్​ చెంపచెల్లుమనేలా మనం మెదక్​ సీటు గెలవాలి
  • అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేపడ్తానని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు : ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉంటే పక్కకు పెట్టి, పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి పనిచేయాలని కాంగ్రెస్​ నేతలకు సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి  సూచించారు. సర్వేలు, ఇతర సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని టికెట్లను ఏఐసీసీ ప్రకటించిందని, అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు. జిల్లా, మండల, గ్రామస్థాయి నేతలంతా సమన్వయంతో వర్క్ చేయాలని, చిన్నపాటి గ్యాప్ వచ్చినా పార్టీ నష్టపోవాల్సి వస్తుందని, ఇది ప్రతిపక్షాలకు మైలేజీ అవుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు గెలవాలని పార్టీ టార్గెట్​గా పెట్టుకున్నదని, ఇందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బుధవారం అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు, నేతలకు రేవంత్​రెడ్డి ఆదేశాలిచ్చారు.

లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పెట్టుకున్న టార్గెట్ ను రీచ్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత నేతలకు స్థాయిని బట్టి ప్రయారిటీ ఇప్పించే బాధ్యత తనదేనని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లు గెలిస్తేనే, పార్టీకి మేలు జరుగుతుందని.. ఇగోకు పోయి అభ్యర్థులను ఆగం చేయొద్దని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో చిన్నపాటి సమన్వయ సమస్యలను గుర్తించామని, అవి ఆయా స్థానాలకు నష్టాన్ని చేకూర్చాయని తెలిపారు. ఇప్పుడు అవి రిపీట్ కావొద్దని ఆయన ఆదేశించారు. 

జిల్లాల్లో పర్యటిస్త

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని జిల్లాల్లో తాను పర్యటిస్తానని నేతలకు సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల మద్దతు పెరిగేందుకు అందరం కలిసి మరింత చొరవ తీసుకుందామన్నారు. క్షేత్రస్థాయి నేతలు, జిల్లా స్థాయి లీడర్లు సమన్వయంతో పనిచేస్తేనే, ఎలాంటి నష్టాలు ఉండవని చెప్పారు. కార్యకర్తల సపోర్టు ఉంటేనే పదేండ్లపాటు పవర్ లో ఉంటామని ఆయన తెలిపారు. పదేండ్ల పాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొని పవర్ లోకి వచ్చామని, ఇప్పుడు చిన్న చిన్న తప్పిదాలతో చేజార్చుకునే పరిస్థితి ఉండకూడదని సూచించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తూనే, పార్టీని ఎలా ఆదుకోవాలో తనకు స్పష్టంగా తెలుసని  చెప్పారు. మెదక్ ఎంపీ సీటును గెలిచి కేసీఆర్ కు చెంపచెల్లు మనే రుచిచూపించాలని ఆ లోక్ సభ నియోజకవర్గ కీలక నాయకులకు సీఎం సూచించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక్క  ఎమ్మెల్యే ఉన్నా.. ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను స్పష్టంగా తీసుకువెళ్తే గెలుపు కష్టమేమీ కాదని అన్నారు. పనివిభజనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని, గతంలో తాను మల్కాజ్ గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇలాంటి వ్యూహాన్నే అనుసరించానని ఆయన వెల్లడించారు. కేసీఆర్ సెంటిమెంట్ గా భావించే మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగిరితేనే, కార్యకర్తల ఆశయాలకు అర్థం ఉంటుందన్నారు.

మెదక్​ను కాంగ్రెస్ ఖాతాలో వేస్కుందాం

లోక్ సభ ఎన్నికల్లో మెదక్ సీటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమని, ఇది మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గెలిచిన సీటు అని సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సీటును గెలిచి కాంగ్రెస్ ఖాతాలో చేర్చుదామని ఆయన పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మెదక్ పార్లమెంట్ సీటుపై రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టారు. సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, నర్సారెడ్డి, మెదక్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల పార్టీ ఇంచార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల ఇంచార్జీలు, నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని రేవంత్ ఆదేశించారు. ‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది.

బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇదే అదనుగా నాయకత్వమంతా కలిసికట్టుగా పనిచేసి మెదక్ సీటును కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేలా కృషి చేయాలి” అని క్యాడర్ కు సూచించారు. ఆరు గ్యారంటీల అమలుతో ప్రజలలో పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని, ప్రచారంలో పథకాలనే ప్రచారస్త్రాలుగా వాడుకొని విజయం సాధించాలన్నారు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్​చార్జీలు ఎప్పటికప్పుడు నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.

ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, పటాన్ చెరు, నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల పార్టీ ఇన్​చార్జీలు కాటా శ్రీనివాస్ గౌడ్, రాజిరెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పూజాల హరికృష్ణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.