హైదరాబాద్, వెలుగు: సర్కారు బడులను బలోపేతం చేసి, విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా విద్యాశాఖ విద్యావారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ‘ప్రజాపాలన–-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలను సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈనెల 17 వరకు వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, మౌలిక సదుపాయాల కల్పనపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. మే 11 నుంచి 17 వరకు జరిగే ఈ వారోత్సవాల్లో విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్, నాయకులను భాగస్వామ్యం చేయనున్నట్టు వెల్లడించారు.
