- కొత్తగూడలో 25 ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాలు
- 112.14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద భారీ బహిరంగ సభ
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలతో పాటు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా కెరమెరి మండలం కొత్తగూడ గ్రామంలో నిర్మించిన 25 ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కొత్తగూడ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర పనులను పూర్తి చేసి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కొత్తగూడ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రెబ్బెన మండలం కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికకు చేరుకుంటారు. ఈ సభ నుంచే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితికా పంత్ పర్యవేక్షిస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన సమీకరణ బాధ్యతలు తీసుకోగా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లాలో పోలీస్ యాక్ట్-30 అమలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ నితికా పంత్ తెలిపారు. పోలీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ.112.14 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. చింతలమానేపల్లి మండలం కౌటాలలో రూ.56 కోట్లతో నిర్మిస్తున్న 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పనులకు, రెబ్బెన మండలం నంబాలలో రూ.6 కోట్లతో ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన, చింతలమానేపల్లి, గుడ్లబోరి, కాపువాడ, చింతకుంట, అంకుషాపూర్ ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, అలాగే, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో రూ.18.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు
సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
