ఇవాళ (జూలై 8న) నడ్డా, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్‌‌‌‌తో రేవంత్‌‌‌‌ భేటీ !

ఇవాళ (జూలై 8న) నడ్డా, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్‌‌‌‌తో రేవంత్‌‌‌‌ భేటీ !

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్‌‌‌‌ గోయల్‌‌‌‌, అశ్వినీ వైష్ణవ్‌‌‌‌తో భేటీ కానున్నారు. రాష్ట్రాభివృద్ధికి చెందిన పలు అంశాలపై మంగళవారం వారితో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఎరువుల కోటా, రైల్వే ప్రాజెక్టులు, జహీరాబాద్ నేషనల్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)పై చర్చించనున్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున కేంద్రం నుంచి రావాల్సిన కోటా రాకపోవడంతో రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడింది. 

మొత్తం 1.94 లక్షల టన్నుల లోటు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్, మే, జూన్‌‌‌‌లో కేంద్రం నుంచి 5 లక్షల టన్నులకు గాను 2 లక్షల టన్నులు మాత్రమే వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. జులై, ఆగస్టు, సెప్టెంబర్ ఖరీఫ్‌‌‌‌ సీజన్‌‌‌‌లో అత్యధికంగా ఎరువుల వాడకం ఉండనుంది. ఈ నేపథ్యంలో ఎరువుల కొరతపై కేంద్ర ఎరువుల, రసాయనల శాఖ మంత్రి జేపి నడ్డాతో సీఎం రేవంత్ చర్చించనునట్లు తెలిసింది. అలాగే, జహీరాబాద్ నిమ్జ్ పారిశ్రామిక కారిడార్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌‌‌‌తో సమావేశం కానున్నారు. 

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌తోనూ రేవంత్‌‌‌‌ భేటీ అయి, కాజీపేట‌‌‌‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, వికారాబాద్‌‌‌‌, కృష్ణా స్టేష‌‌‌‌న్ మ‌‌‌‌ధ్య నూత‌‌‌‌న రైలు మార్గం నిర్మాణం, క‌‌‌‌ల్వకుర్తి, మాచర్ల మ‌‌‌‌ధ్య నూత‌‌‌‌న రైలు మార్గం మంజూరు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అలాగే, పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌‌‌కు సంబంధించిన అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోరినట్లు తెలిసింది. కాగా.. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.