ఆరు గ్యారంటీల అప్లికేషన్, పోస్టర్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్

ఆరు గ్యారంటీల  అప్లికేషన్, పోస్టర్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్

ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజాపాలన దరఖాస్తుల లోగోను ఆవిష్కరించారు.  కాంగ్రెస్ 6 గ్యారంటీల దరఖాస్తును విడుదల చేశారు సీఎం. డిసెంబర్ 28 నుంచి  జనవరి 6 వ తేదీ వరకు అభయహస్తం దరఖాస్తులను స్వీకరించనున్నారు. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయత పథకానికి అప్లై చేసుకునేలా అవకాశం కల్పించింది.

 

 

అన్నింటికీ ఒక్కటే అప్లికేషన్

  •  ప్రజా పాలనలో భాగంగా అర్హుల నుంచి తీసుకునే దరఖాస్తులో మొదటి పేజీలో కుటుంబ వివరాలతో పాటు ఇంటి యజమాని పేరు, క్యాస్ట్, పుట్టిన తేదీ, ఆధార్, రేషన్ కార్డు, వృత్తి వివరాలను తీసుకుంటారు.
  • మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కు గ్యాస్ సిలిండర్​కు గ్యాస్ కనెక్షన్ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య వివరాలు తీసుకోనున్నారు.
  • రైతు భరోసా పథకం కింద ఏటా రైతులకు రూ.15 వేలు ఇచ్చేందుకు రైతు, కౌలు రైతు కేటగిరీల వారీగా వివరాలు తీసుకోనున్నారు. పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం అడిగారు.
  • వ్యవసాయ కూలీలకు ఏటా12 వేలు  ఇచ్చేందుకు ఉపాధి హామీ కార్డు నంబర్ ఇవ్వాలి.
  • ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఇండ్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేది ఒకటి. మరో కేటగిరీలో అమరవీరులు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చేందుకు.. నమోదైన కేసు, ఎఫ్ఐఆర్​ వివరాలు, ఎంతకాలం ఏ జైలులో ఉన్నారు? ఒకవేళ అమరులైతే చనిపోయిన సంవత్సరం, డెత్ సర్టిఫికెట్ వంటివి నింపాల్సి ఉంటుంది.
  • గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం మీటర్ నంబర్, ప్రతినెల గృహ విద్యుత్ వినియోగం వివరాలు ఇవ్వాలి.
  • చేయూత పథకం కింద రూ.4 వేల కోసం వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలిసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళల జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్​ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ టేకేదారు జీవన భృతి సర్టిఫికెట్లు, దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు పొందేందుకు సదరం సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి అప్లికేషన్‌కు ఒక రసీదు ఇస్తారు. అందులో ఏ అధికారి అప్లికేషన్ తీసుకున్నారో ఆయన పేరు తీసుకోనున్నారు. ప్రతి అప్లికేషన్​కు ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు కాపీలను జత చేయాల్సి ఉంటుంది.