- రూ.1,200 కోట్లతో అభివృద్ధి పనులు
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: సంక్రాంతికి ముందే రూ.1,200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్జిల్లాకు రానున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నగరంలోని మర్లులో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రూ.680 కోట్లతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను, రూ.220 కోట్లతో ప్రజలకు శుద్ధ జలం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా సరే సీఎం రేవంత్ రెడ్డి మన అభ్యర్థి అనుకొని ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్టేడియంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నీని ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం నగరంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న బీసీ హాస్టల్లో ఆర్వో ప్లాంట్ ను, హయగ్రీవ దేవాలయం సమీపంలో, హౌసింగ్ బోర్డులో మహిళా జిమ్ఓపెనింగ్, పార్క్ రెనోవేషన్ పనులను ప్రారంభించారు. కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, నాయకులు వినోద్‌కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.
