సామాజిక న్యాయమే తెలంగాణ మోడల్ : సీఎం రేవంత్​రెడ్డి

సామాజిక న్యాయమే తెలంగాణ మోడల్ : సీఎం రేవంత్​రెడ్డి
  • విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టినం: సీఎం రేవంత్​రెడ్డి
  • అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతే డీలిమిటేషన్​పై కేంద్రం ముందుకెళ్లాలని డిమాండ్​
  • ది హిందూ హడిల్​-2025’ కార్యక్రమంలో ప్రసంగం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి  అన్నారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాల్లో తెలంగాణ మోడల్‌‌‌‌ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శుక్రవారం బెంగుళూరులో నిర్వహించిన ‘ది హిందూ హడిల్​– 2025’ కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి ప్రణాళికలను సమన్వయంతో అమలు చేస్తున్నామన్నారు. విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు.

 దేశంలోనే మొట్టమొదటిగా నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీలకు రూపకల్పన చేశామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను రద్దు, 360 కి.మీ. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, పారిశ్రామిక పార్కులు, ఐటీ, ఆటోమొబైల్ రంగాలకు మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలను చేపట్టినట్టు ఆయన తెలిపారు. కేంద్రం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి స్పష్టమైన ప్రాతిపదికను వెల్లడించిన తర్వాతే డీలిమిటేషన్‌‌‌‌పై ముందుకు వెళ్లాలని డిమాండ్​ చేశారు. అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలను శిక్షించకూడదని.. సామాజిక, రాజకీయ న్యాయం కోసం చర్చ జరగాలన్నారు. భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని, దేశ రక్షణలో అహర్నిశలు కృషి చేస్తున్న సైనికులకు అందరూ మద్దతు తెలపాలని సీఎం పిలుపునిచ్చారు.


కులగణన దేశానికి రోల్​ మోడల్​

రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే దేశానికి రోల్​ మోడల్‌‌‌‌గా నిలిచిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఈ సర్వే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రజలకు సేవలు అందించడంలో దోహదపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మోడల్‌‌‌‌ను అనుసరించాలని ఆయన సూచించారు. విద్యా రంగంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలను ఇంటిగ్రేట్ చేసి సోషలైజేషన్ ప్రక్రియను ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 59 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని.. స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, టాటా టెక్నాలజీస్ సహకారంతో 105 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నట్టు వివరించారు. 

రాష్ట్రంలో 25 లక్షలకు పైగా రైతులకు 21,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, రైతులకు ఏటా 12 వేల ఇన్‌‌‌‌పుట్ సబ్సిడీ (రైతు భరోసా), 24 గంటల ఉచిత విద్యుత్, క్వింటాల్‌‌‌‌కు రూ.500 బోనస్‌‌‌‌తోపాటు కనీస మద్దతు ధర అందిస్తున్నామని సీఎం తెలిపారు. 67 లక్షల సభ్యులున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ ఉత్పత్తి, పాఠశాల నిర్వహణ, యూనిఫామ్ బాధ్యతలు అప్పగించామని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించామని, ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తాయని వివరించారు. సహేతుకమైన ప్రణాళికలతో పరిశ్రమలు, ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జపాన్ పర్యటనలో తెలుసుకున్న అంశాల ఆధారంగా.. జపనీస్ భాషను తెలంగాణలో నేర్పించి, ఆ దేశానికి మానవ వనరులను సమకూర్చే దిశగా చర్యలు చేపట్టినట్టు సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు.