గండిపెల్లి ప్రాజెక్ట్​ పూర్తయ్యేనా .. అటకెక్కిన రీడిజైన్ ప్రతిపాదనలు

గండిపెల్లి ప్రాజెక్ట్​ పూర్తయ్యేనా .. అటకెక్కిన రీడిజైన్ ప్రతిపాదనలు
  • పనులు నిలిచిపోయి పుష్కర కాలం గడుస్తుంది
  • గతేడాది ప్రాజెక్ట్​ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​నియోజకవర్గ పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్​కు అనుబంధంగా గండిపల్లి ప్రాజెక్ట్​నిర్మించాలని 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయించారు.  0.156 టీఎంసీల సామర్థ్యంతో,14 వేల ఆయకట్టు లక్ష్యంగా పాత చెరువు పై పనులు ప్రారంభించారు. యాభై శాతం పనులు పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్​పనులు నిలిచిపోయాయి.

2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవెల్లి ప్రాజక్టును 8.26 టీఎంసీ, గండిపల్లి ప్రాజక్టును 1.4 టీఎంసీలకు పెంచి 40 వేల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు కానీ ఆ దిశగా ఎలాంటి పనులు జరగలేదు. తర్వాత ప్రాజెక్ట్​సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించి రీ డిజైన్ లు తయారు చేసినా అవి కార్యరూపం దాల్చలేదు.    

ప్రత్యామ్నాయ పనులతో ఆయకట్టు పెంపు

మొదట గండిపల్లి ప్రాజెక్టును 0.156 సామర్థ్యంతో 14 వేల ఎకరాలకు నీళ్లివ్వాలని అధికారులు నిర్ణయించారు. తర్వాత  రీ డిజైనింగ్​తో ఆయకట్టు 40వేల ఎకరాలకు పెంచి హుస్నాబాద్, జనగామ జిల్లాల్లోని గ్రామాలకు అదనపు ప్రయోజనం కల్పించాలని భావించారు. ముంపు బాధలేకుండా  ప్రత్యామ్నాయంగా పంప్​హౌజ్​ సామర్థ్యాన్ని పెంచి కాల్వల సంఖ్యను పెంచాలని నిర్ణయించినా ఎలాంటి ముందడుగు పడలేదు. ప్రస్తుతం రీ డిజైన్ ప్రతిపాదనలు పక్కన పెట్టి పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్ట్​ మిగులు పనులకు అవసరమైన నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.

కట్టపై దట్టంగా పెరిగిన చెట్లు

రీ డిజైన్​కారణంగా కొంత కాలంగా గండిపల్లి ప్రాజెక్ట్​ వద్ద పనులు నిలిచిపోవడతో కట్టపై దట్టంగా చెట్లు పెరిగాయి. గత ఏడాది మార్చిలో హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గండిపల్లి ప్రాజెక్ట్​ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్ట్​లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు నీళ్లిస్తామని హామీ 
ఇచ్చారు.  

పాత డిజైన్ ప్రకారమే ప్రాజెక్ట్​పనులు

పాత డిజైన్ ప్రకారమే గండిపల్లి ప్రాజెక్ట్​పనులు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. రీ డిజైనింగ్​ప్రతిపాదనలు విరమించడంతో పాత డిజైన్ ప్రకారం 0.156 టీఎంసీల సామర్థ్యంతో 14 వేల ఎకరాలకు నీళ్లిచ్చే విధంగా కొత్త రేట్ల  ప్రకారం ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వం నుంచి  ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే తూము, పైప్ లైన్, కట్ట ఎత్తు పనులను ప్రారంభిస్తాం. 

వెంకట కృష్ణారావు, ఈఈ, గండిపల్లి ప్రాజెక్ట్​